తాజా సర్వే.. కాంగ్రెస్ కే ఎక్కువ ఎంపీ సీట్లు!
మిగిలిన పథకాలను కూడా అమలు చేయడానికి కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది.
By: Tupaki Desk | 6 March 2024 7:37 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలను అమల్లోకి తెచ్చింది. మిగిలిన పథకాలను కూడా అమలు చేయడానికి కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది.
కాగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే పునరావృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆ పార్టీ దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లోనూ తెలంగాణలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయని తాజాగా ఒక సర్వే పేర్కొంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టీవీ– సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పునరావృతం చేస్తుందని సర్వే పేర్కొంది. ఇండియా టీవీ– సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని సర్వే తెలిపింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా–ఫ్రెండ్లీ పరిపాలన గ్రామ స్థాయి నుండి పెద్ద నగరాల వరకు ప్రజలను ఆకట్టుకుంటోందని సర్వే వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. 10 సీట్లలో విజయం సాధించడానికి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన, ప్రజల సమస్యలను సూటిగా పరిష్కరించడమే కారణాలు అవుతాయని పేర్కొంది.
ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పట్ల మహిళా ఓటర్లు చాలా సంతోషిస్తున్నారని సర్వే వెల్లడించింది. దీంతో మహిళా ఓటర్లంతా కాంగ్రెస్ కే జైకొట్టే చాన్సు ఉందని తెలిపింది. అదేవిధంగా, ఇతర పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని వివరించింది.
కాగా కరీంనగర్, మహబూబాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ తోపాటు మరో నియోజకవర్గం కలిపి ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. ప్రధాని మోడీ వల్లే బీజేపీకి ఓట్లేయాలని ఓటర్లు అనుకుంటున్నట్టు తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పనితీరు పార్లమెంటు ఎన్నికల్లోనూ ఘోరంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. బీఆర్‌ఎస్ కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలుస్తుందని సర్వే తెలిపింది.
ఇక హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ గెలుస్తారని సర్వే వెల్లడించింది. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక సీటుతో సరిపెట్టుకున్నాయి.