Begin typing your search above and press return to search.

దేశంలో కాంగ్రెస్ కు తెలంగాణనే ఆశ.. శ్వాస

సర్వేను బట్టి చూస్తే మాత్రం.. కర్ణాటకలోనే కాస్త ఆశావహంగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ కు మాత్రం తెలంగాణనే ఆశగా మిగిలింది.

By:  Tupaki Desk   |   11 Feb 2024 1:30 AM GMT
దేశంలో కాంగ్రెస్ కు తెలంగాణనే ఆశ.. శ్వాస
X

వచ్చే లోక్ సభ ఎన్నికలు మామూలువి కాదు.. హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తున్న మోదీ.. మరోసారి వస్తే వెయ్యేళ్లు గుర్తుండేలా పాలన అంటూ ప్రకటనలు.. ఇటు చూస్తే ప్రతిపక్ష కాంగ్రెస్ ఇండియా కూటమి కట్టి పోరాటం.. మధ్యలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ యాత్రలు.. కానీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మిత్రపక్షాలతో సమస్యలు.. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపెవరిది? అనే సందేహానికి మొన్నటి ఇండియా టుడే సర్వే సమాధానం చెప్పింది.

దక్షిణాదిలో తెలంగాణలోనే దమ్ము..

దేశవ్యాప్తంగా ఏన్డీఏ కూటమి మరోసారి స్పష్టమైన మెజారిటీతో అధికారం సాధిస్తుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. కాగా, ఇదే సమయంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పింది. అయితే, ఉత్తరాదిలో బీజేపీ ఎలాగూ గట్టి పట్టున్న పార్టీనే. మరి దక్షిణాదిలో పరిస్థితి ఏమిటి? అనే ఆసక్తికర ప్రశ్న వచ్చింది. ఇక్కడ కూడా మెజారిటీ సీట్లు గెలుస్తుందా? అనే సందేహం నెలకొంది. సర్వేను బట్టి చూస్తే మాత్రం.. కర్ణాటకలోనే కాస్త ఆశావహంగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ కు మాత్రం తెలంగాణనే ఆశగా మిగిలింది.

పట్టు పదిలమే..

సర్వే ప్రకారం దక్షిణాదిన తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ కు రెండంకెల సంఖ్యలో సీట్లు రానున్నాయి. ఇక్కడ పది సీట్లను హస్తం పార్టీ గెలవనుంది. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్ లేదు. ఇండియా కూటమిలో భాగమైనా తమిళనాడులో డీఎంకేదే పెత్తనం. కేరళలో లెఫ్ట్ దే ఆధిపత్యం. అక్కడ అసలు రాహుల్ గాంధీకే సీటు లేదంటున్నాయి వామపక్షాలు. అయితే, కర్ణాటకలో మొన్ననే అధికారంలోకి వచ్చినప్పటికీ.. లోక్ సభ ఎన్నికల్లో ఆ ప్రభావమే లేనట్లు తెలుస్తోంది. అక్కడ బీజేపీకి 20పైగా సీట్లు వస్తుంటే కాంగ్రెస్ 4తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కానీ, తెలంగాణంలో మాత్రం 10 సీట్లు నెగ్గనుందని తేలడం విశేషం. కాగా, దీనికిముందు ఏబీపీ-సీ ఓటర్ సర్వే కూడా తెలంగాణలో కాంగ్రెస్ కు 9 నంచి 11 సీట్లు వస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు ఈ స్థాయిలో సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవడం గమనార్హం. అంటే రేవంత్ సారథ్యంలోని తెలంగాణే కాంగ్రెస్ కు ఆశ, శ్వాస.