కాంగ్రెస్‌కు పెరిగే ఓటు బ్యాంకు ఎంత..!
ఏపీలో కాంగ్రెస్ కు పెరిగే ఓటు బ్యాంకు ఎంత? ఎంత వరకు పుంజుకుంటుంది? ఇదీ ఇప్పుడు రాజకీయం గా చర్చకు వస్తున్న ప్రశ్న.
By: Tupaki Desk | 6 Jan 2024 3:51 AM GMTఏపీలో కాంగ్రెస్ కు పెరిగే ఓటు బ్యాంకు ఎంత? ఎంత వరకు పుంజుకుంటుంది? ఇదీ ఇప్పుడు రాజకీయం గా చర్చకు వస్తున్న ప్రశ్న. 2019, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ రెండు ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌కు రాలేదు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఇప్పుడు 2024 ఎన్నికల్లో పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి షరిష్మాను వినియోగించుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలను ఏపీలో పార్టీకి చీఫ్‌ను చేయడం ద్వారా వైఎస్ ఓటు బ్యాంకును సాను భూతిని సొంతం చేసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆలోచనగా ఉంది. గతంలో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గా ల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీకి దన్నుగా మారింది. ఇప్పుడు ఇదే ఓటు బ్యాంకును తిరిగి తమవైపు తిప్పుకోవాలన్నది కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం.
అయితే, ఇది ఎంత వరకు సాధ్యమవుతుంది? ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి? అనేది కూడా సందేహంగానే ఉంది. ఎందుకంటే.. రాష్ట్రాన్ని విడదీసి.. ద్రోహం చేశారని.. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఒక చర్చ ఇప్పటికీ నడుస్తోంది. పైకి ఎన్ని సార్లు హోదా ఇస్తామని చెబుతున్నా.. దీనిని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
అయితే., వైఎస్ కుమార్తెగా షర్మిల తన వంతు ప్రయత్నం అయితే చేయొచ్చు. వైసీపీలో ఉన్న కాంగ్రెస్ పాత నేతలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. కానీ, ఓటు బ్యాంకు విషయానికి వస్తే మాత్రం కష్టమనే వాదన వినిపిస్తోంది. పార్టీ ఎలానూ అధికారంలోకి వచ్చే అవకాశం లేనందున.. ఆ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ సాధించాల్సిన ప్రధాన విషయమని అంటున్నారు పరిశీలకులు. ఈ దిశగా పార్టీ అడుగులు వేసినా.. ఎన్నికలకు కేవలం మూడు మాసాల సమయం మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ ఎంత వరకు పుంజుకుంటుందనేది చూడాలి.