Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల వేళ కాంగ్రెస్‌లో భోగి మంట‌లు.. పుట్టి మునుగుడేనా?

రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని నిల‌బెట్టుకోవాలి.. మ‌రో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి!

By:  Tupaki Desk   |   5 Nov 2023 11:30 PM GMT
ఐదు రాష్ట్రాల వేళ కాంగ్రెస్‌లో భోగి మంట‌లు.. పుట్టి మునుగుడేనా?
X

రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని నిల‌బెట్టుకోవాలి.. మ‌రో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి! ఇదీ.. జాతీయ పార్టీ కాంగ్రెస్ పెట్టుకున్న కీల‌క ల‌క్ష్యం. ఆదిశ‌గా పార్టీ అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మిగిలిన మూడు రాష్ట్రాల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఈశాన్య రాష్ట్రం మిజోరాం, తెలంగాణ‌లు ఉన్నాయి. సో.. కాంగ్రెస్ ముందు భారీ ల‌క్ష్య‌మే ఉంది.

దీంతో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు కూడా.. రంగంలోకి దిగి ప్ర‌చారం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలంటూ ఓ రాష్ట్రం లో ఏడు గ్యారెంటీలంటూ.. మ‌రో రాష్ట్రంలో ఇలా ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో క‌ర్నాట‌క‌లో తాము పొందిన అధికారం.. అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ‌ను ఆశీర్వ‌దించిన తీరును కూడా ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ వివ‌రిస్తోంది. అయితే.. ఇదే క‌ర్ణాట‌క‌లో నేత‌ల మ‌ధ్య నెలకొన్న చిక్కులు పార్టీలో భోగిమంట‌లు రేపుతున్నాయి. సీఎం సిద్ద‌రామ‌య్యకు వ్య‌తిరేకంగా.. సీఎం సీటు కోసం.. కొంద‌రు నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కాంగ్రెస్‌కు డ్యామేజీగా మారాయి.

ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ అంటే కుమ్ము లాట‌ల పార్టీగా ఆయ‌న పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను న‌మ్మితే.. పుట్టిమున‌గ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. నిజానికి ఆయ‌న అలా అన్నారో లేదో.. ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్‌లో క‌ర్ణాట‌కలో నెల‌కొన్న పొలిటిక‌ల్ అనిశ్చితిపై సోషల్ మీడియాలో జోరుగా కాంగ్రెస్‌కు వ్య‌తిరేక ప్ర‌చారం ప్రారంభ‌మైంది. బీజేపీ నాయ‌కులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. జ‌రిగేదిదే అంటూ పోస్ట‌ర్ల ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

వెర‌సి ఎలా చూసుకున్నా.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదాలు, విభేదాలు.. కాంగ్రెస్‌కు త‌ల‌నొప్పి గా మారాయి. తాజాగా తెలంగాణ‌లోనూ ``కాంగ్రెస్ అంటే.. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థుల పార్టీ`` అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్క‌డా కూడా కాంగ్రెస్ విష‌యంలో సానుభూతి చూపించొద్ద‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల వేళ డోలాయ‌మానంలో ప‌డింది. పోనీ.. అటు క‌ర్ణాట‌క‌లో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుదామంటే.. అయ్యేలా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.