Begin typing your search above and press return to search.

పదేళ్ల తర్వాత లోక్ సభలో విపక్ష నేత.. మోదీకి పవర్ కు గట్టి సవాల్

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో భారత దేశంలో సార్వత్రిక ఎన్నికల అంకం దాదాపు పూర్తి అయింది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 3:30 PM GMT
పదేళ్ల తర్వాత లోక్ సభలో విపక్ష నేత.. మోదీకి పవర్ కు గట్టి సవాల్
X

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో భారత దేశంలో సార్వత్రిక ఎన్నికల అంకం దాదాపు పూర్తి అయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారంతో మరో ఐదేళ్లు ఆయనే ఉంటారని స్పష్టమైపోయింది. అయితే, ఆర్ఎస్ఎస్ గనుక ‘ఇక చాలు’ అంటే మోదీ తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మోదీ 3.0 మొదలైందనే అనుకోవాలి. గత రెండుసార్లు లేని.. ఇప్పుడే ఉన్న ప్రత్యేకత ఒకటుంది.

పదేళ్లుగా ఖాళీ..

రాష్ట్రాల స్థాయిలో ప్రతిపక్ష నేత ఎంత కీలకమో.. కేంద్రంలో లోక్ సభలో విపక్ష నేత అంతే కీలకం. గత పదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండగా.. ఈ పదవి మాత్రం ఖాళీగా ఉంది. కారణం.. కాంగ్రెస్ సహా మరే ప్రధాన పార్టీ కూడా తగిన సంఖ్యలో సీట్లు సాధించకపోవడమే. లోక్ సభలో మొత్తం స్థానాలు 543. ఇందులో పదో వంతు అంటే 54 స్థానాలు సాధించిన పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదాను పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లకు, 2019లో కాస్త మెరుగుపడినా 52 స్థానాలకు పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి లోక్ సభలో విపక్ష నేత పదవి దక్కలేదు. యూపీలో 80 సీట్లున్నందున సహజంగానే సమాజ్ వాదీ పార్టీకి తప్ప మరే పార్టీకీ 50 కంటే ఎక్కువ స్థానాలు వచ్చే చాన్సుండదు. ప్రతిపక్ష నేత పదవి దక్కే అవకాశమూ రాదు. అయితేగియితే కాంగ్రెస్ కే.

ఈసారి రాహుల్?

ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినా అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇందులో ప్రధాన పార్టీ కాంగ్రెస్ 100 సీట్లు సాధించింది. పదేళ్ల తర్వాత ఈ మార్క్ ను చేరిన ఆ పార్టీకి ఇప్పుడు లోక్ సభలో విపక్ష నేత హోదా దక్కే చాన్సుంది. దీనికిముందుగానే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమై రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఉండాల్సిందిగా తీర్మానించింది. అంటే రాహుల్ కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత కానున్నారు. మరోవైపు రాహుల్ విపక్ష నేత కూడా అవడం ఖాయమేనని తెలుస్తోంది. ఇప్పటికే మోదీని తీవ్రంగా విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ కు విపక్ష నేత పదవి దక్కితే రాజకీయం రంజుగా ఉంటుందనడంలో సందేహం లేదు.

కీలక పదవి ఎందుకంటే..

లోక్ సభలో విపక్ష నేత పదవి కేబినెట్ ర్యాంక్ తో సమానం. అంతేకాదు.. సభలో సీట్ల కేటాయింపు, పార్టీలకు కార్యాలయ గదుల కేటాయింపు వంటి చిన్న విషయాలతో పాటు.. పార్లమెంటరీ కమిటీల నియామకంలో విపక్ష నేత పాత్ర ఉండాల్సిందే. అన్నిటికిమించి సీబీఐ, సీవీసీ, ఎన్నికల సంఘం, ఎన్ హెచ్ఆర్సీ వంటి అత్యంత ముఖ్యమైన సంఘాల్లో నియామక కమిటీల్లో లోక్ సభలో విపక్ష నేత ఒక సభ్యుడిగా ఉంటారు.