చావో రేవో... కాంగ్రెస్ షాక్ తినిపిస్తోంది...!
అధికారం ఈసారి రాకపోతే ఇక ఎప్పటికీ రాదు అన్నది కూడా కాంగ్రెస్ కి బాగా అర్ధం అయింది అని అంటున్నారు
By: Tupaki Desk | 19 Nov 2023 3:48 PM GMTతెలంగాణా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీయారెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే రెండు సార్లు తప్పిపోయిన చాన్స్ ని ఈసారి తప్పనిసరిగా దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. అదే టైం లో ఈసారి చావో రేవో అన్నట్లుగా కాంగ్రెస్ పోరాడుతోంది.
అధికారం ఈసారి రాకపోతే ఇక ఎప్పటికీ రాదు అన్నది కూడా కాంగ్రెస్ కి బాగా అర్ధం అయింది అని అంటున్నారు. అందుకే ఎన్నడూ లేని ఐక్యతను కాంగ్రెస్ నేతలు చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి అన్నది తరువాత ముందు అధికారం దక్కించుకోవడమే లక్ష్యం అని కూడా అంటున్నారు.
ఇది కాంగ్రెస్ నేతలలో వచ్చిన గొప్ప మార్పుగా చూడాలి. అలాగే ఎపుడూ కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలను దగ్గరకు తీసుకున్న సందర్భం లేదు. ఆ పార్టీలో ఉన్న వారు ఉంటారు, లేని వారు వెళ్ళిపోతారు. అయితే ఈసారి విశేషం ఏంటి అంటే కాంగ్రెస్ తన పార్టీలో నేతలను అలా ఉంచుకుంటూనే బయట పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకోవడం.
ఇది నిజంగా ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. ఆ పార్టీలలో కట్టుబాట్లు ఎక్కువ కాబట్టి ఏ నేతను తీసుకున్నా అధినాయకత్వం మాటకు ఎదురు చెప్పరు. కాంగ్రెస్ కాంగ్రెస్ లో అలా కాదు, స్వేచ్చ ఎక్కువ. జాతీయ పార్టీ కాంగ్రెస్. దాంతో హై కమాండ్ ఎక్కడో ఉంటుంది. అందువల్ల నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రకటనలు విడుదల చేస్తారు.
తన ప్రాంతానికి తామే సామంతులమని ఫీల్ అవుతారు. మరో పార్టీ నుంచి నేతను తెచ్చినా అసలు ఊరుకోరు. కానీ ఈసారి చిత్రంగా కాంగ్రెస్ లో అలాంటి సర్దుబాటు కూడా కనిపిస్తోంది. వచ్చిన వారిని రానీయ్ అని ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే టికెట్ల కోసం పోరు ఒక లెవెల్ లో ఉంటుంది.
టికెట్ రాని వారు ఎంత రచ్చ చేయాలో అంతా చేస్తారు. రెబెల్స్ గా బరిలోకి దిగి ప్రత్యర్ధుల కంటే ఎక్కువగా పార్టీని ఓడించాలని చూస్తారు. నిజానికి ఇలాంటి వాటి వల్లనే కాంగ్రెస్ ఎక్కువగా ఓడిపోతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం రెబెల్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు.
బాగానే శాంతిస్తున్నారు. హై కమాండ్ మాట తమకు శిరోధార్యం అని కూడా అంటున్నారు. తమకు దక్కుతున్న హామీలతో సంతృప్తి పడుతున్నారు. పార్టీని విజయపధంలో గెలిపించాలని చూస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ చూస్తూంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటోంది అని అర్ధం అవుతోంది. అదే టైం లో అధికారాన్ని దక్కించుకునేందుకు ఏమి చేయాలో అన్నీ చేస్తోంది. కాంగ్రెస్ లో కనిపిస్తున్నా ఈ గొప్ప మార్పుతోనే ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరుతోంది అని అంటున్నారు. ఇదే ప్రత్యర్ధి పార్టీలు అసలు ఊహించని విషయంగా ఉంది అని అంటున్నారు. అలా షాక్ తినిపిస్తోంది అని అంటున్నారు.