ఇందిరమ్మ నెగ్గిన సీటుపై కాంగ్రెస్ గట్టి ఫోకస్
ఈ సీటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదే కాక.. అక్కడ గెలవడం ద్వారా ప్రధాన ప్రత్యర్థిని మానసికంగానూ దెబ్బకొట్టినట్లు అవుతుందని ఆలోచిస్తోంది.
By: Tupaki Desk | 4 April 2024 4:30 PM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకూ మాంచి ఊపుమీద వెళ్తోంది. ప్రత్యర్థి పార్టీల నుంచి భారీఎత్తున నాయకులను చేర్చుకుంటూ దూకుడు చూపుతోంది. ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని సొమ్ముచేసుకోవాలని చూస్తోంది. ఇదే క్రమంలో ఒక్క స్థానంపై మాత్రం గట్టిగా కన్నేసింది. ఈ సీటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదే కాక.. అక్కడ గెలవడం ద్వారా ప్రధాన ప్రత్యర్థిని మానసికంగానూ దెబ్బకొట్టినట్లు అవుతుందని ఆలోచిస్తోంది.
ప్రధానిని అందించిన నియోజకవర్గం
ఉమ్మడి ఏపీ రెండుసార్లు భారతదేశానికి ప్రధాన మంత్రిని అందించింది. అదెలా సాధ్యం..? తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు మాత్రమే కదా.. ఇక్కడినుంచి ప్రధాని అయింది అనుకుంటున్నారా? అయితే, ఆయన కంటే దాదాపు 8 ఏళ్ల ముందే దివంగత నేత ఇందిరాగాంధీ ఉమ్మడి ఏపీ నుంచి ప్రధాని అయ్యారు. అదెలాగంటే.. ఎమర్జెన్సీ విధింపు కారణంగా 1978 ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ. కానీ, 1980 నాటికి పరిస్థితులు మారాయి. ఇందిర స్వయంగా మెదక్ లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి కూడా ఇందిర నెగ్గినా.. మెదక్ ను అట్టిపెట్టుకున్నారు.
మెదక్ ఎంపీగా ఉండగానే హత్య
1984లో మెదక్ ఎంపీగా ఉండగానే ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు ఇందిరా గాంధీ. విశేషం ఏమంటే భారత ప్రధానిగా ఉంటూనే మెదక్ జిల్లా పరిషత్ సమావేశానికి ఓ సభ్యురాలి (ఎంపీ హోదాలో)గా ఆమె హాజరయ్యారు. అలా చరిత్రలో మెదక్ స్థానం నిలిచిపోయింది. కాగా, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ను ఎలాగైనా నెగ్గాలని రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలోని నేతలతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇటీవలి ఎన్నికల్లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ తరఫున నెగ్గారు. ఆయన తండ్రి హనుమంతరావు గతంలో మెదక్ ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ఈ ఊపును కొనసాగిస్తూ మెదక్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నారు.
బీఆర్ఎస్ ను భారీ దెబ్బ కొట్టాలని
మెదక్ లోక్ సభ స్థానం పరిధిలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ కీలక నాయకుడు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట స్థానాలు ఉన్నాయి. అంతేగాక.. మెదక్ ఆ పార్టీ సిటింగ్ స్థానం. వచ్చే ఎన్నికల్లో గనుక అక్కడ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు అది పెద్ద దెబ్బనే.