Begin typing your search above and press return to search.

షర్మిలను జగన్ మీదకు ఎగదోస్తున్న కాంగ్రెస్...!

కర్నాటక కోటాలో నామినేట్ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కూడా మీడియాలో కధనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   16 Feb 2024 2:30 AM GMT
షర్మిలను జగన్ మీదకు ఎగదోస్తున్న కాంగ్రెస్...!
X

కాంగ్రెస్ తన ఎత్తుగడలను చాలా తెలివిగా అమలు చేస్తోంది. దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది. తెలంగాణాలో తన పార్టీని నడుపుకుంటున్న వైఎస్ షర్మిలను నేర్పుగా ఏపీ వైపు నడిపించింది. దానికి గానూ ఆమె పార్టీని విలీనం చేసుకుంది. ఆమెకు ఆనాడు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి విలీనం చేయించినట్లుగా ప్రచారం అయితే సాగింది. కర్నాటక కోటాలో నామినేట్ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కూడా మీడియాలో కధనాలు వచ్చాయి.

ఏ హామీ లేకుండా కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని ఎందుకు విలీనం చేస్తారు అన్నది అపుడూ ఇపుడూ వేసుకునే ప్రశ్న. నిజానికి కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి పాలేరు నుంచి తాను పోటీ చేయాలని షర్మిల అనుకున్నారు అని వార్తలు వచ్చాయి. అది కాదు అంటే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని కోరారని కూడా కధనాలు వచ్చాయి. అయితే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారు. కానీ రాజ్యసభ సీటు దక్కలేదు. నామినేషన్లకు గడువు ఫిబ్రవరి 15తో ముగిసిన వేళ ఈ విషయం క్లియర్ అయింది.

ఏపీలో తాడూ బొంగరం లేని కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించమని పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారు. ఈ పదవి మాత్రమే విలీనం తరువాత ఆమెకు దక్కింది. ఇక షర్మిల తన కష్టం తన ఇమేజ్ తన తండ్రి ఇమేజ్ ని చూపించి కాంగ్రెస్ గ్రాఫ్ ఏపీలో పెంచాలి. వాటి ఫలితాలు వస్తే కాంగ్రెస్ తో పాటు ఆమెకు కూడా లాభమే.కానీ ఒకవేళ రాకపోతే మాత్రం కాంగ్రెస్ కి ఏమీ పోయింది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పదేళ్లుగా అలా ఏపీలో పడేసిన బండిగానే ఉంది.

ఎటొచ్చి షర్మిల రాజకీయమే ఇబ్బందులలో పడుతుంది. నిజానికి ఏపీ పీసీసీ చీఫ్ ఇచ్చి రాజ్యసభ సీటు ఇస్తే ఆరేళ్ల వరకూ ఆమెకు ఢోకా ఉండేది కాదు. ఆ పదవిలో ఉంటూ ఆ ప్రోటోకాల్ తో పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ బండిని కదిలించడం కొంత సులువు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ అలా చేయలేదు. అంటే షర్మిలను వ్యూహాత్మకంగా ముగ్గులోకి దించి ఏపీలో అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ సమరానికి తెర తీసింది అని అంటున్నారు.

ఇపుడు ఈ కధ ఇక్కడితో అయిపోలేదు అని అంటున్నారు. షర్మిలను కడప నంచి ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ పెద్దలు కోరుతున్నారని ప్రచారం సాగుతోంది. అంటే వైసీపీకి ఆయువు పట్టుగా ఉన్న జిల్లాలోనే ఓట్ల చీలిక తెమ్మని కోరుతున్నారు. ఈ పోటీలో కాంగ్రెస్ గెలవకపోయినా వైసీపీకి నష్టం కలిగితే కాంగ్రెస్ పెద్దలకు అదే పదివేలుగా ఉంటుంది అని అంటున్నారు.

ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ నుంచి షర్మిలకు తన పార్టీని విలీనం చేసినందుకు దక్కినది పీసీసీ చీఫ్ పదవేనా అన్న చర్చ అయితే ఉంది. ఏపీలో ఏమీ కాని కాంగ్రెస్ ని ఆమె ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అద్భుతాలు సృష్టిస్తారు అన్నది కాలమే చెప్పాలి. ఇక ఆమెకు అధికార పదవులు దక్కేది ఎపుడు అన్నది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది.