Begin typing your search above and press return to search.

ఎగ్జిట్‌ పోల్స్‌ వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. బీజేపీ వెటకారం!

అవును... నేటి సాయంత్రం నుంచి సందడి చేయబోతున్న ఎగ్జిట్‌ పోల్స్‌ పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 4:02 AM GMT
ఎగ్జిట్‌  పోల్స్‌  వేళ కాంగ్రెస్  కీలక నిర్ణయం.. బీజేపీ వెటకారం!
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం చివరిదశకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు చివరిదైన ఏడోదశ పోలింగ్ ముగుస్తుంది. వీటన్నింటికీ సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈలోపు ఈరోజు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా సందడి చేయనున్నాయి. ప్రతీ టీవీ ఛానల్స్ లోనూ డిబేట్లు హోరెత్తబోతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగియనుంది. ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం ఈ రోజు సాయంత్రం వరకూ ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించకూడదనే సంగతి తెలిసిందే. దీంతో... ఈ రోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలుకాబోతుంది. ఈ సమయంలో వీటికి సంబంధించిన చర్చల్లో పాల్గొన కూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

అవును... నేటి సాయంత్రం నుంచి సందడి చేయబోతున్న ఎగ్జిట్‌ పోల్స్‌ పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్‌ పర్సన్‌ పవన్‌ ఖేరా "ఎక్స్‌"లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. అందుకు గల కారణాన్ని సవివరంగా వివరించారు.

ఇందులో భాగంగా... పోలింగ్‌ ముగిసేసరికి ప్రజలంతా ఓటుహక్కుతో తమ నాయకులను ఎన్నుకొని ఉంటారని.. వారి వారి నిర్ణయాలు ఈవీఎంలలో భద్రంగా ఉంటాయని.. ఎన్ని చర్చలు పెట్టినా ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. మరి అలాంటప్పుడు టీఆర్పీ రేటింగ్‌ ల కోసం ఊహగానాలను ప్రచారం చేయడం ఎందుకని పవన్‌ ఖేరా ప్రశ్నించారు.

ఎగ్జిట్ పోల్స్‌ పై చర్చా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పాల్గొనబోదు. చర్చ ద్వారా ఏదో ఒక కచ్చితమైన విషయాన్ని ప్రజలకు చేరవేయాలి. అందుకే జూన్‌ 4 తర్వాత జరిగే చర్చల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ పాల్గొంటుంది అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

బీజేపీ వెటకారం!:

ఎగ్జిట్ పోల్స్‌ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ స్పందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ద్వారా తన ఓటమిని అంగీకరించినట్లేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. తనకు అనుకూలమైన ఫలితాలు రాని సందర్భంలో కాంగ్రెస్‌ ముందుగానే వైదొలగడం సాధారణమేనని అన్నారు.