బండ్లగూడ నుంచి ఇల్లందు దాక.. అవిశ్వాసంతో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఉక్కపోత
అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండి ఉంటే.. అవిశ్వాసాలకు చాన్స్ ఉండేది కాదని భావించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే రాజకీయం మారింది.
By: Tupaki Desk | 8 Feb 2024 11:30 AM GMTహైదరాబాద్ లో మోస్ట్ డిమాండెడ్ ఏరియా అయిన మణికొండ.. అత్యంత ఖరీదైన బండ్లగూడ జాగీర్ నుంచి ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్న ఖానాపూర్ వరకు.. మరెక్కడో ఉన్న ఇల్లందు దాకా.. ఆ మూలన ఉన్న జమ్మికుంట నుంచి ఈ మూలన ఉన్న నల్లగొండ వరకు.. తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సమయంలోనే.. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలకు నాలుగేళ్ల గడువు తీరడంతో అవిశ్వాసాలకు వీలు చిక్కింది. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండి ఉంటే.. అవిశ్వాసాలకు చాన్స్ ఉండేది కాదని భావించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే రాజకీయం మారింది.
హైదరాబాద్ నుంచి.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల సెగ పూర్తిగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యనే అనుకోవడానికి ఏమీ లేదు. సొంత పార్టీల్లోని వైరి వర్గాలే అవిశ్వాసానికి ప్రతిపాదిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చైర్మన్ల ఒంటెత్తు పోకడలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అసమ్మతి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. నిధులను అభివృద్ధికి వినియోగించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలూ అసంతృప్త కౌన్సిలర్ల నుంచి వస్తున్నాయి.
సర్కారు మారడంతో..
రాష్ట్రంలో సర్కారు మారడం కూడా అవిశ్వాసాలకు పురికొల్పుతోంది. పురపాలక సంఘాల కౌన్సిలర్లు, నగరపాలక సంస్థల కార్పొరేటర్లు రాజకీయ భవిష్యత్తును వెదుక్కునేందుకు ఇదే సమయంగా భావిస్తున్నారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లో ఇలానే విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ నెల 17న ఓటింగ్ జరగనుంది. మణికొండలోనూ అవిశ్వాసం తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మహబూబ్ నగర్ లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మీద కాంగ్రెస్ సభ్యులు ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. సూర్యాపేట జిల్లా కోదాడ చైర్ పర్సన్ శిరీష, వైస్ చైర్మన్ పద్మలపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అయితే ఆలేరు ఛైర్మన్ శంకరయ్యపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది వరంగల్ జిల్లా నర్సంపేట లో పాలకపక్షంలోని ఛైర్మన్ కుర్చీ కోసం చాలాకాలంగా కుమ్ములాట సాగుతోంది. గత నెల 30న అవిశ్వాస తీర్మానం చేపట్టే వరకు వచ్చింది. కాగా, నల్లగొండ మున్సిపాలిటీని బీఆర్ఎస్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి కోల్పోయింది. మంచిర్యాల, క్యాతనపల్లి పురపాలికల్లోనూ అవిశ్వాస అలజడి నెలకొంది. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా పేర్లు వస్తాయి.
రాజకీయ పునరేకీకరణ
తెలంగాణలో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరషన్లు బీఆర్ఎస్ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే, వీటిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మధ్య అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. ఛైర్ పర్సన్‌లను దక్కించుకునే క్రమంలో పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతు కూడగట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల కోసం గతంలో ఇచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నారు. కాగా, ఇల్లందులో కాంగ్రెస్ చైర్మన్ ను దించాలనే బీఆర్ఎస్ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.
మొత్తం 40 చోట్లపైనే..?
తెలంగాణలో జవహర్ నగర్ మేయర్ పదవితో పాటు 26 పురపాలక సంఘాల ఛైర్ పర్సన్లు, 9 మంది వైస్ ఛైర్ పర్సన్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందినట్లు డిసెంబరు నెలాఖరులోనే పురపాలకశాఖ తెలిపింది. వీటిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్ మేయర్, ఇల్లందు, హుజూరాబాద్, మంచిర్యాల, నస్పూర్, నర్సాపూర్, ఆర్మూర్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, సదాశివపేట, సంగారెడ్డి, నల్లగొండ, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, దమ్మాయిగూడ, మేడ్చల్, జనగామ, తాండూరుల్లో ఛైర్ పర్సన్ల మీద, వికారాబాద్, కోదాడ, నందికొండ, చండూరు, చేర్యాల, ఖానాపూర్, బెల్లంపల్లిలో ఛైర్ పర్సన్లతో పాటు వైస్ ఛైర్‌పర్సన్లపైనా అవిశ్వాసం పెట్టినట్లు పేర్కొంది. మణికొండ, బండ్లగూడ జాగీర్ తదితర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లనూ కలిపితే 40కి పైగా చోట్ల అవిశ్వాసాల కత్తులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.