కేసీఆర్ గెలిచేందుకు ఓ నియోజకవర్గం రెడీ చేసిన కాంగ్రెస్
స్వేచ్చ ఎక్కువ అంటూ ఆ పార్టీ నేతలు జరిగే రచ్చను కవర్ చేసుకుంటున్నప్పటికీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆ పార్టీ నేతలు వారి రాజకీయ ప్రత్యర్థులకు చాన్స్ ఇస్తూనే ఉంటారు.
By: Tupaki Desk | 23 Sep 2023 2:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంత అనైక్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వేచ్చ ఎక్కువ అంటూ ఆ పార్టీ నేతలు జరిగే రచ్చను కవర్ చేసుకుంటున్నప్పటికీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆ పార్టీ నేతలు వారి రాజకీయ ప్రత్యర్థులకు చాన్స్ ఇస్తూనే ఉంటారు. అలా తాజాగా ఏకంగా ఓ నియోజకవర్గంలో జరుగుతున్న రచ్చతో అధికార బీఆర్ఎస్ పార్టీకి అక్కడ గెలుపొందడం సులభమనే టాక్ వినిపిస్తోంది. అలా హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం ఎల్‌బీ నగర్. కాంగ్రెస్ నేతల చేతే అలా విమర్శల గుప్పిట్లో చిక్కుకున్న నాయకుడు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్.
మధుయాష్కీ తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ప్రకటించుకోవడమే కాకుండా ఈ మేరకు టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకులు దీనిపై ఆదిలోనే అసహనం వ్యక్తం చేస్తూ గాంధీభవన్‌లో వ్యతిరేక పోస్టర్లు వేశారు. ఇప్పుడు తాజాగా ఈ పంచాయతీ ఢిల్లీ చేరింది. స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అగ్ర నాయకులకు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వేదికగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.
గ్రేటర్‌లో కీలకమైన ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తమకే కావాలంటూ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, మిద్దెల జితేందర్, సుదిని మహేందర్ తదితరులు కోరుతూ స్థానికంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరిలో వీరు తామంటే తామే ఇన్‌చార్జిలమంటూ పోటాపోటీగా ప్రకటనలు గుప్పించి, తమకే టికెట్ వస్తుందంటూ కాలనీల్లో పాదయాత్రలు సైతం మొదలుపెట్టారు. వీరిలో ఈ వివాదం ఇలా ఉండగానే టికెట్ దరఖాస్తులో భాగంగా నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తాను ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తానంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు అసలు రచ్చ ఇక్కడే మొదలయింది.
ఎల్బీనగర్ టిక్కెట్ మధుయాష్కీకి ఇవ్వకండి.. స్థానికంగా మాలో ఎవరికైనా ఇవ్వండి అంటూ స్థానిక నేతలు పేర్కొంటున్నారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటుగా ఇతర పార్టీ పెద్దలకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. నియోజకవర్గంలో రచ్చ ఢిల్లీ బాట పట్టడంతో , స్థానిక నేతల తిరుగుబాటు ముసలంతో అగ్ర నాయకులు సైతం అయోమయం చెందుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఈ రచ్చను జాగ్రత్తగా గమనిస్తూ తమకో నియోజకవర్గం దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మధుయాష్కీ తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ప్రకటించుకోవడమే కాకుండా అందుకు తాను ఎలా అర్హుడిని అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్‌నగర్ తన స్వస్థలమని, పాఠశాల విద్య కూడా ఇక్కడేనంటూ పేర్కొంటూ కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అంతేకాకుండా తన తల్లిదండ్రుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయని ఆయన క్లెయిం చేసుకున్నారు. మరోవైపు ఈ పరిణామాలను బీఆర్ఎస్, బీజేపీ ఆసక్తికరంగా గమనిస్తూ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.