Begin typing your search above and press return to search.

ఆమెకు తెలిసింది.. కిచెన్‌ లో వంట వండుకోవడమే!

దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్‌ నెలకొంది. ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఉధృత ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 8:30 AM GMT
ఆమెకు తెలిసింది.. కిచెన్‌ లో వంట వండుకోవడమే!
X

దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్‌ నెలకొంది. ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఉధృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమవుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటి కంగన రనౌత్‌ ను ఉద్దేశించి కాంగ్రెస్‌ మహిళా నేత ఒకరు, అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి బీజేపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి.

ఇప్పుడు ఇదే కోవలో కర్ణాటకలో దావణగెరె నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాయత్రి సిద్దేశ్వర్‌ పై కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

దావణగెరె స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్న తన కోడలు ప్రభా మల్లికార్జున్‌ తరఫున ఎమ్మెల్యే శివశంకరప్ప ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వర్‌ పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థికి ‘వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు‘ అని ఎమ్మెల్యే శివశంకరప్ప అన్నారు.

గాయత్రి సిద్దేశ్వర్‌ గురించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘‘ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోనివ్వండి.. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేశాం. మీకు తెలిసిందే ఒక్కటే.. కిచెన్‌ లో వంట చేయడం మాత్రమే తెలుసు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

మరోవైపు శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర్‌ స్పందించారు. ప్రస్తుతం మహిళలు ఏ వృత్తిని చేపట్టడం లేదో ఆయన చెప్పాలన్నారు. మహిళలు వంట ఇంట్లోనే ఉండాలని ఆయన అంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారన్నారు. ఆకాశంలో కూడా మహిళలు ఎగురుతున్నారని ఆమె చెప్పారు.

మహిళలు ఎంత అభివృద్ధి చెందారో ఈ ముసలి వ్యక్తి (శివశంకరప్ప)కు తెలియదని గాయత్రి మండిపడ్డారు. ఇంట్లో మగవాళ్లకు, పిల్లలకు, పెద్దవాళ్లకు ఎంత ప్రేమగా మహిళలు వంట చేస్తారో తెలియదా అని నిలదీశారు.

ఈ నేపథ్యంలో కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహిళా నేతకు సీటు ఇవ్వకుండా పక్కనపెట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు శివశంకరప్పపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే బీజేపీ ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.