Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డీ.. ఏమిటీ అలక? పార్టీకి చేటు చేయక

బలమైన నాయకుడే అయినా పార్టీకి ఉపయోగపడరు. కీలక సమయంలో చేయిస్తూ చుక్కలు చూపిస్తారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 9:33 AM GMT
కోమటిరెడ్డీ.. ఏమిటీ అలక? పార్టీకి చేటు చేయక
X

బలమైన నాయకుడే అయినా పార్టీకి ఉపయోగపడరు. కీలక సమయంలో చేయిస్తూ చుక్కలు చూపిస్తారు. పదవుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాకూ కావాలంటూ పోటీ పడతారు.. తమ కుటుంబానికి అన్నివిధాలా ప్రాధాన్యం ఇచ్చినా ఇంకా మరేదో కావాలంటారు. సోదరులిద్దరం ఒకే మాట మీద ఉంటాం అంటూనే.. తమ్ముడు వేరే పార్టీకి వెళ్లినా ఊరుకుంటారు. సరే.. పాత గొడవలన్నీ సద్దుమణిగాయంటున్న క్రమంలో మరో పేచీకి దిగారు.

కమిటీల్లో చోటు కష్టమే..?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు అలవాటైన పద్ధతిలొ మళ్లీ అలకపాన్పు ఎక్కారు. రాజీనామా అస్త్రాన్ని మరోసారి బయటకు తీశారు. ఎప్పటిలాగే అధిష్ఠానం బుజ్జగింపులతో కాస్త వెనక్కుతగ్గారు. వాస్తవానికి వెంకటరెడ్డి సిటింగ్ ఎంపీగా ఉన్నారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన టీపీసీసీ పదవిని ఆశించారు. అదికాస్త రేవంత్ రెడ్డికి దక్కడంతో అలిగారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లినా అన్న మాత్రం హస్తాన్నే నమ్ముకున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా దివంగత సీఎం వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండడం.. ఆయన మరణం పరిస్థితులు మారిన నేపథ్యంలో అధిష్ఠానం కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఓ కన్నేసి ఉంచింది. దీంతోనే పీసీసీ చీఫ్ పదవితో పాటు కమిటీల్లో చోటుఇవ్వడం లేదనిపిస్తోంది.

ఆ రెండు కమిటీల్లోనూ

తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఊపులో కనిపిస్తున్న కాంగ్రెస్ ఇటీవల జాతీయ స్థాయిలోనూ పార్టీలో అనేక మార్పులు చేసింది. కాంగ్రెస్ లో అత్యున్నత విధాన నిర్ణయాల వర్కింగ్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ఎన్నికల కమిటీతో పాటు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీలనూ నియమించింది. వీటిలో వేటిలోనూ వెంకటరెడ్డికి స్థానం దక్కలేదు. ఉమ్మడి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి సీడబ్ల్యూసీలో చోటిచ్చింది. తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. ఉత్తమ్ ను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లోకీ తీసుకుంది. ఒకే (ఉమ్మడి) జిల్లాకు చెందిన ఉత్తమ్ కు పెద్దపీట వేసి తనను విస్మరించడం కోమటిరెడ్డికి కినుక తెప్పించింది. ఆయన మిగిలింది పీసీసీ స్టార్ క్యాంపెయినర్ పదవే.

గాంధీభవన్ కు దూరం

పార్టీ పెద్దగా విశ్వాసంలోకి తీసుకున్నట్లు కనిపించకపోవడంతో వెంకటరెడ్డి గాంధీభవన్ కు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ అయి ఉండీ.. అభ్యర్థుల ఎంపిక వడపోతను పరిశీలిస్తున్న ప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీ (పీఈసీ) రెండు సమావేశాలకూ రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. అయితే, అప్రమత్తమైన అధిష్ఠానం ఆయనను బుజ్జగించేందుకు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను రంగంలోకి దించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోనూ మాట్లాడించింది.