కాంగ్రెస్ లోనే కోటీశ్వరులు ఎక్కువ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంతులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే
By: Tupaki Desk | 26 Nov 2023 3:50 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంతులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ ప్రకటించిన వివరాలే అందుకు నిదర్శనం. మొత్తం 2290 మంది అభ్యర్థుల్లో 580 మందికి రూ.కోటికి పైగా ఆస్తులున్నాయని ఏడీఆర్ పేర్కొంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 90 శాతం, మొత్తంగా చూస్తే 25 శాతం మంది కోటీశ్వరులున్నారని వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ లోనే కోటీశ్వరులు ఎక్కువగా ఉన్నారు.
ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల జాబితాలో రూ.606 కోట్లతో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) రూ.458 కోట్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి (పాలేరు) రూ.433 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టాప్-10 అత్యధిక ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులున్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి (భువనగిరి) రూ.211 కోట్లు, గడ్డం వినోద్ (బెల్లంపల్లి) రూ.197 కోట్లు, బండి రమేష్ (కూకట్ పల్లి) రూ.160 కోట్లు, జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి) రూ.124 కోట్లు కాంగ్రెస్ నుంచి టాప్-10లో ఉన్న ఇతర నేతలు.
బీఆర్ఎస్ నుంచి పైళ్ల రాజశేఖర్ రెడ్డి (భువనగిరి) రూ.227 కోట్లతో నాలుగో స్థానంలో, కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) రూ.197 కోట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. బీజేపీ నుంచి రవికుమార్ యాదవ్ (శేరిలింగంపల్లి) రూ.171 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే సగటు ఆస్తి పరంగా కాంగ్రెస్ లో రూ.38 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. బీఆర్ఎస్ (రూ.25.62కోట్లు), బీజేపీ (రూ.16.15కోట్లు), ఎంఐఎం (రూ.10.46కోట్లు), ఫార్వర్డ్ బ్లాక్ (రూ.2.94 కోట్లు), బీఎస్పీ (రూ.2.02కోట్లు), సీపీఎం (రూ.1.01 కోట్లు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.