వారందరిని అన్నా అనాలె.. రేవంత్ ను టార్గెట్ చేయాలె!
తమ వాదనకు అనుకూలంగా ఎవరినైనా తెచ్చుకునే అలవాటు కేసీఆర్ లో కనిపిస్తుంది. ఆయన కొడుకుగా కేటీఆర్ అదే వ్యూహాన్ని మరింత పక్కాగా అమలు చేశారు
By: Tupaki Desk | 17 Dec 2023 5:26 AM GMTశనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూసినప్పుడు.. తమకు అలవాటైన విభజించి.. పాలించే విధానాన్ని విజయవంతంగా మరోసారి అమలు చేశారు కేటీఆర్. తమ వాదనకు అనుకూలంగా ఎవరినైనా తెచ్చుకునే అలవాటు కేసీఆర్ లో కనిపిస్తుంది. ఆయన కొడుకుగా కేటీఆర్ అదే వ్యూహాన్ని మరింత పక్కాగా అమలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న వేళలో.. సీనియర్ నేత జానారెడ్డి.. విలువలకు నిలువెత్తు రూపంగా నిలిచే జైపాల్ రెడ్డి లాంటి వారిని ఉద్దేశించి ఎంత చులకనగా.. మరెంత సంస్కారహీనంగా మాట్లాడారో తెలియంది కాదు. ఉద్యమ సమయంలో జైపాల్ రెడ్డి గురించి ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా ఆయనపై ఎన్ని అవాకులు చవాకులు పేలారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తండ్రికి తగ్గట్లే తనయుడు కేటీఆర్ సైతం తక్కువ తినలేదు. ఈ రోజున విపక్షంలో ఉండి విలువల గురించి మాట్లాడే ఆయన.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఏకవచనంలో.. ఇష్టారాజ్యంగా మాట్లాడిన వైనాన్ని మర్చిపోకూడదు. అలాంటి కేటీఆర్ నోటి నుంచి మర్యాద గురించి వచ్చిన మాటల్ని చూస్తే.. మాటలు నేర్చినమ్మ ఏమైనా మాట్లాడుతుందన్న సామెత గుర్తుకు రాక మానదు.
తన ప్రసంగంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ ను టార్గెట్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ఉన్నాయని చెప్పాలి. విభజించు పాలించు అన్న సిద్దాంతాన్ని ఫాలో అయిన కేటీఆర్.. తాము చేసిన తప్పుల్ని మాత్రం కన్వీనియంట్ గా మర్చిపోవటం కనిపిస్తుంది. ''మా భట్టి అన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి అన్న.. వీరందరు కలిసి పెట్టిన కాంగ్రెస్ పార్టీలో దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వ్యక్తి చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటుంది'' అని మాట్లాడిన కేటీఆర్.. తన తండ్రి ప్రభుత్వంలో వేరే పార్టీని నుంచి.. అందునా ఉద్యమ వేళలో సమైక్య వాణిని వినిపించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదలు కొని ఎందరో నేతల్నిపార్టీలోకి తెచ్చి మంత్రి పదవులు ఇవ్వటం మాటేమిటి?
ఉద్యమంలో కోట్లాడిన నేతల్ని పట్టించుకోకుండా.. ప్యారాచూట్ నేతలకు పెద్దపీట వేసిన గులాబీపార్టీ నేతలు.. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీని ఒక తాటి మీద నడిపించింది ఎవరన్న విషయం తెలియంది కాదు. అన్నీ తానై నడిపించిన రేవంత్ కు.. ముఖ్యమంత్రి పదవి ఇవ్వటాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. కాంగ్రెస్ నేతలకు లేని బాధంతా కేటీఆర్ కు ఎందుకు? అన్నది ప్రశ్న. మా భట్టి అన్నా.. మా శ్రీధర్ అన్నా.. మా దామోదర్ అన్నా.. అంటూ ఈరోజున ప్రేమను ఒలకబోస్తున్న కేటీఆర్.. విపక్షంలో ఉన్న వేళలో.. అసెంబ్లీలో వారు మాట్లాడేందుకు సరిగా టైం కూడా ఇవ్వలేదన్న వాస్తవాన్ని మర్చిపోవటం చూస్తే.. కేటీఆర్ చతురత కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మాటలు బుల్ డోజ్ .. విపక్షంలో ఉన్నప్పుడు విభజించు పాలించు వ్యూహంతో అధికారపక్షాన్ని బుల్ డోజ్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.మరి.. కేటీఆర్ మాటలకు తెలంగాణ ప్రజలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.