Begin typing your search above and press return to search.

షర్మిలకు కాంగ్రెస్ సీనియర్లు సినిమా చూపిస్తారా !?

ఉమ్మడి ఏపీ నుంచి ఒక సెక్షన్ వైఎస్సార్ ని వ్యతిరేకిస్తూ వచ్చింది. అదే సెక్షన్ ఆయన మరణాంతరం జగన్ ని సీఎం కాకుండా అడ్డుకుందని ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   26 May 2024 2:15 PM GMT
షర్మిలకు కాంగ్రెస్ సీనియర్లు సినిమా చూపిస్తారా !?
X

ఉమ్మడి ఏపీ నుంచి ఒక సెక్షన్ వైఎస్సార్ ని వ్యతిరేకిస్తూ వచ్చింది. అదే సెక్షన్ ఆయన మరణాంతరం జగన్ ని సీఎం కాకుండా అడ్డుకుందని ప్రచారం సాగింది. విభజన తరువాత కాంగ్రెస్ లో మిగిలిన నాయకులలో వైసీపీని జగన్ ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే ఎక్కువ. వీరంతా సమయం వస్తే టీడీపీని అయినా పొగుడుతారు కానీ జగన్ ని అసలు మెచ్చరు.

దాని వెనక కారణాలు వైఎస్సార్ హయాంలో వారి అనుభవాలు రాజకీయాలు కావచ్చు. ఇక కాంగ్రెస్ లో అనూహ్యంగా షర్మిల చేరి ఏపీ పగ్గాలు చేపట్టింది. ఆమె ప్రతీ అడుగులోనూ వ్యూహాత్మక తప్పిదాలే కనిపించాయి. ఒక స్ట్రాటజీ వరకూ తీసుకుంటే కాంగ్రెస్ బాధ్యతలు ఆమె 2024 ఎన్నికల ఫలితాల తరువాత స్వీకరించవచ్చు.

అయిదేళ్ళ నిండు కాలం ఉంటుంది. పార్టీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటే 2029 నాటికి ఆమె కష్టానికి తగిన ఫలితం కనిపించేది అన్నది ఒక వాదన ఉంది. అలా కాదు 2024 ఎన్నికలే టార్గెట్ అనుకుంటే కనీసం ఏడాది ముందు అయినా ఆమె వచ్చి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకోవాల్సింది. ఎటూ కాకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీ బాధ్యతలు స్వీకరించడం ద్వారా షర్మిల దుస్సాహసం చేసింది అని అంటున్నారు.

పైగా ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేయడం మరో రిస్క్ ఫ్యాక్టర్ గా చూస్తున్నారు. ఇవన్నీ చివరికి కాంగ్రెస్ లో ఆమె రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతాయో అన్న చర్చ ఉండనే ఉంది. దానికి తోడు అన్నట్లుగా గత రెండు ఎన్నికల్లో పార్టీ కునారిల్లినా కూడా పార్టీ నేతల మధ్య పూర్తి స్థాయిలో ఐక్యత అయితే లేదు అన్నట్లుగా సీన్ ఉంది.

చిత్తూరు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయితే అపుడే షర్మిల మీద ఘాటు విమర్శలు చేశారు. ఆమె ఒంటెద్దు పోకడలు పోయిందని నిందించారు. ఈసారి ఏపీలో కాంగ్రెస్ దశ తిరుగుతుందని, కనీసంగా అయిదు నుంచి పది అసెంబ్లీ సీట్లు రెండు నుంచి అయిదు ఎంపీ సీట్లు గెలిచేలా వాతావరణం ఉందని భావించామని కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది అని ఆయన అంటున్నారు.

షర్మిల తప్పుడు వ్యూహాల మూలంగానే కాంగ్రెస్ కి ఏపీలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన విమర్శించారు. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లలేదని అన్నారు. ఏపీలో మొత్తం 175 స్ధానాల్లో రాజకీయ కమిటీలు ఉన్నా కూడా ఎవరితోనూ సంప్రదించినట్లుగా లేదని ఆయన ఫైర్ అయ్యారు.

అంతే కాదు ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదని తాను చెప్పింది నూరు శాతం వాస్తవం అని చింతా మోహన్ అంటున్నారు. పార్టీలో చాలా మంది ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారని కానీ వాళ్లు బయటకు మాట్లాడలేకపోతున్నారని.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వైఎస్ షర్మిలకు ఆయన గుర్తు చేయడమే అసలైన పంచ్ అంటున్నారు. అంటే వైఎస్సార్ తనయ అన్న ట్యాగ్ తో కాంగ్రెస్ లో చేరి ఏదో చేద్దామనుకుంటే కుదరదు అని ఆయన స్పష్టం చేశారు అని అంటున్నారు.

అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా ప్రజాస్వామ్య వాతావరణం లేదని అన్నారు. మరో భారీ ఆరోపణ కూడా ఆయన చేశారు. పార్టీ టికెట్ల విషయంలో డబ్పులు మారాయని అంతా అనుకుంటున్నారని బాంబు పేల్చిన చింతా ఎవరు తీసుకున్నారో తెలియదని అనడమే విశేషం. మొత్తానికి చూస్తే ఈ సీనియర్ నేత షర్మిల మీద నేరుగానే విరుచుకుపడ్డారు అని అంటున్నారు.

ఇక రాజమండ్రికి చెందిన మరో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ ఉన్నారు. ఆయన కూడా తనకు కాంగ్రెస్ ఏపీ నాయకత్వం నుంచి ఎలాంటి పిలుపులూ లేవని చెప్పడం జరిగింది. ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా షర్మిల నియామకాన్ని కూడా ఆయన విమర్శించారు. ఇదంతా అన్నా చెల్లెలు సాగించిన వ్యూహం అని కూడా అప్పట్లో అన్నారు. మొత్తానికి కీలక సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలూ షర్మిల నాయకత్వాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు.

మరి కొందరు సీనియర్లు కేంద్ర మాజీ మంత్రులు కూడా షర్మిల పార్టీ ప్రెసిడెంట్ కావడం వల్ల ఏమీ ఉపయోగం లేదని అంతర్గతంగా అంటున్నారు. ఆమె ప్రసంగాలలో పరిణతి లేదని కూడా వారు చెబుతున్నారు. ఇక ఆమె అందరినీ కలుపుకుని పోవడం లేదు అన్నది కామన్ విమర్శ.

ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 2019లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి కనీసంగా రెండు నుంచి నాలుగు శాతం ఓటు షేర్ వస్తే కనుక షర్మిల మాట కాంగ్రెస్ హై కమాండ్ వద్ద చెల్లుతుంది. లేకపోతే ఆమెను పక్కన పెట్టాలని పార్టీలో నేతలు కోరినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. వైసీపీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా షర్మిలకు కాంగ్రెస్ లో అయితే కేవలం వైఎస్సార్ తనయ అని నిలదొక్కుకోవడం చాలా కష్టం అని అంటున్నారు.

కాంగ్రెస్ ఒక మహా సముద్రం. సీనియర్లు చాలా మంది ఉంటారు. వారిని అందరినీ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగడం కత్తి మీద సాము. తెలంగాణాలో రేవంత్ రెడ్డి అది సాధించారు అంటే ఆయన రాజకీయ అనుభవం వ్యూహాల వల్లనే అని అంటున్నారు. ఏపీలో మాత్రం ఏ మాత్రం కాంగ్రెస్ తీరు వేరు అని తేల్చేస్తున్నారు. మొత్తం మీద షర్మిల పీసీసీ చీఫ్ పదవి మూన్నాళ్ళ ముచ్చటేనా అంటే జవాబు కాలమే చెబుతుంది అంటున్నారు.