మంత్రి పీఠం ప్లీజ్.. ఢిల్లీలో క్యూ కట్టిన నాయకులు!
మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 17 Dec 2023 2:30 AM GMTతెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం 11 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో 7 గురు వరకు అవకాశం ఉంది. ఎమ్మెల్యేల లెక్క ప్రకారం.. 18 మంది వరకు మంత్రులు ఉండొచ్చు. దీంతో ఆ మిగిలిన ఏడు స్థానాల కోసం.. చాలా మంది నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. వాటిని కూడా డుమ్మా కొట్టి.. ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతూ.. మంత్రి పీఠం ప్లీజ్ అంటూ.. అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కీలక నాయకులకు మొదటి విస్తరణలో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. వీరిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం.
ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు 'గడ్డం' సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై నమ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకొన్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు.
అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని చర్చ జరుగుతోంది. ఇక, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూడా మంత్రి పదవి రేసులో ముందున్నారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాల్లో మునిగిపోయారు.