కాంగ్రెస్ అభ్యర్థుల కన్ఫ్యూజన్: చేయెత్తి కారుకు ఓటేయమంటున్నారు
తాజాగా నిర్వహించిన ప్రచారంలో చేతి గుర్తుకు ఓటు అనే బదులు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరటంతో అక్కడి ఓటర్లు షాక్ తిన్న పరిస్థితి.
By: Tupaki Desk | 27 Nov 2023 4:18 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి అందుకు భిన్నంగా ఎన్నికల ప్రచారం మరింత తీవ్రంగా సాగుతుందని చెప్పాలి. అధికార బీఆర్ఎస్ తో పాటు విపక్ష కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అగ్రనాయకత్వం తెలంగాణ మీద గురి పెట్టటం.. పెద్ద ఎత్తున ప్రచారం చేయటం కనిపిస్తుంది. వివిధ పార్టీల అగ్రనేతలు ఎంతో సీరియస్ గా ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ.. బరిలో నిలిచిన అభ్యర్థులు మరెంతో సీరియస్ గా పోరాడుతుంటారు.
కానీ.. ఎక్కువ పని చేసినప్పుడు అవసరానికి మించిన కన్ఫ్యూజన్ కు గురి అవుతారంటారు. ఆ మాటకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలిచిన వారు.. హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరాల్సింది పోయి.. వారే స్వయంగా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరటంతో ఓటర్లు కంగుతింటున్నారు. సభల్లో చోటు చేసుకుంటున్న ఈ తరహా పరిణామాలు వైరల్ గా మారి మరింత లొల్లి చేస్తున్నాయి.
అభ్యర్థుల తడబాటు వారికి ఇబ్బందిగా.. ప్రత్యర్థుల నెత్తిన పాలు పోసేలా మారిందన్న మాట వినిపిస్తోంది.మొన్నటికి మొన్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న యశస్విని రెడ్డి.. తన ప్రసంగంలో భాగంగా జై కేసీఆర్ అంటూ స్లోగన్ ఇవ్వటం ఆమెను అభాసు పాలు చేసేలా చేసింది. తాజాగా మరో కాంగ్రెస్ అభ్యర్థి సైతం బీఆర్ఎస్ కు అనుకూల నినాదాలు ఇవ్వటం గమనార్హం.
బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి పూర్వ రంగంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. సుదీర్ఘ కాలం పాటు గులాబీ పార్టీలో ఉన్నారు. గులాబీ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్న వేళలోనే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన తర్వాతి కాలంలో కాంగ్రెస్ లోకి రావటం తెలిసిందే. తాజాగా నిర్వహించిన ప్రచారంలో చేతి గుర్తుకు ఓటు అనే బదులు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరటంతో అక్కడి ఓటర్లు షాక్ తిన్న పరిస్థితి. తన తప్పును తెలుసుకున్న ఆయన వెంటనే సరి చేసుకునే ప్రయత్నం చేసినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న భావనలోకాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు ఉండటం గమనార్హం.