Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి తెలంగాణలో మెజారిటీ రాక 34 ఏళ్ళు ..?

రెండు దఫాలు అధికారంలో ఉన్నది కాబట్టి బీయారెస్ వీక్ అయింది అని ఈ సర్వేలు చెబుతున్నా దాన్ని అందిపుచ్చుకుని కాంగ్రెస్ ఎందుకు ఫుల్ మెజారిటీ దిశగా అడుగులు వేయలేకపోతోంది అన్న చర్చ అయితే సాగుతోంది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:35 AM GMT
కాంగ్రెస్ కి తెలంగాణలో మెజారిటీ రాక 34 ఏళ్ళు ..?
X

తెలంగాణాలో ఏ సర్వేను చూసినా మరే ఒపీనియన్ పోల్ ని తీసుకున్నా ఏ పార్టీకి మెజారిటీ రాదు అనే చెబుతున్నాయి. రెండు దఫాలు అధికారంలో ఉన్నది కాబట్టి బీయారెస్ వీక్ అయింది అని ఈ సర్వేలు చెబుతున్నా దాన్ని అందిపుచ్చుకుని కాంగ్రెస్ ఎందుకు ఫుల్ మెజారిటీ దిశగా అడుగులు వేయలేకపోతోంది అన్న చర్చ అయితే సాగుతోంది.

అయితే కాంగ్రెస్ కి తెలంగాణాలో ఈ ఎన్నిక అని కాదు గత మూడున్నర దశాబ్దాలుగా జరిగిన అనేక ఎన్నికల్లో ఎపుడూ మెజారిటీ రాలేదు అని గణాంకాలు చెబుతున్నాయి. 2014, 2018లలో కాంగ్రెస్ ఓడింది. ఈసారి వేవ్ ఉంది కాబట్టి గెలుస్తుంది అని అనుకుంటున్నా మెజారిటీకి ఆమడదూరంలో ఉంటోంది. దానికి కారణం ఈ రోజు కాదు 1989 నుంచి ఇదే తీరు అని అంటున్నారు.

అంటే ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ ఏ రోజూ తెలంగాణాలోని 119 సీట్లలో మెజారిటీ దక్కలేదు అని సవివరంగా ఎన్నికల అంకెలు చెబుతున్నాయి. 1989 నుంచి తీసుకుంటే ఇప్పటికి ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఏడు సార్లు తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్ కి ఎపుడూ 60 సీట్లు దక్కలేదు అన్నది ఆశ్చరంగా ఉన్నా అదే నిజం అని పాత చరిత్ర చెబుతోంది.

ఇక ఉమ్మడి ఏపీలో 1989లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు మర్రి చెన్నారెడ్డి అనే తెలంగాణా నాయకుడే సీఎం అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలంగాణాలోని 119 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది కేవలం 58 సీట్లు మాత్రమే. చిత్రమేంటి ఇప్పటిదాకా కాంగ్రెస్ తెలంగాణాలో గెలిచిన అత్యధిక సీట్లు ఈ 58నే అంటున్నారు. ఈ ఫిగర్ ని దాటి కాంగ్రెస్ ముందుకు వెళ్లలేకపోతోంది.

ఇక కాంగ్రెస్ 1994లో జరిగిన ఎన్నికల్లో సైతం టోటల్ గా ఉమ్మడి ఏపీలో 26 సీట్లు గెలిచి చతికిలపడితే 119 సీట్లు ఉన్న తెలంగాణాలో గెలిచింది కేవలం 6 సీట్లు మాత్రమే అని గుర్తు చేసుకోవాల్సి ఉంది అంటున్నారు. ఆ తరువాత వైఎస్సార్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ కి తెలంగాణాలో కొంచెం గ్రాఫ్ పెరిగింది. 1999లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అనుకుంటే 90కి పైగా సీట్లు దక్కాయి. అయితే అందులో తెలంగాణా రీజియన్ లో మాత్రం 42 సీట్లు సాధించింది. ఇది మంచి నంబర్ కిందనే చూడాలి. ఇక 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని గెలిపించి సీఎం అయ్యారు.

అయితే ఆ ఎన్నికల్లో తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది 48 సీట్లు మాత్రమే. అంటే ఇది కూడా మంచి ఫిగరే కానీ ఎక్కడా యాభై సీట్లు కూడా దక్కలేదు, పైగా సింపుల్ మెజారిటీకి దూరంగా ఉండిపోయింది అన్నది గుర్తుంచుకోవాలి.

ఇక 2009లో కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో 156 సీట్లను సాధించింది. వైఎస్సార్ హయాంలో రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఇందులో తెలంగాణా సీట్ల వాటా చూసుకుంటే మరోసారి వైఎస్ హయాంలోనే 2009 లో 50 సీట్లు సాధించింది అని చెప్పుకోవాలి.

ఇక ఈ నంబర్ ని ఇప్పటిదాకా అంటే విభజన తరువాత ఎప్పుడూ కాంగ్రెస్ చేరుకోలేకపోయింది అని అంటున్నారు. 2014లో 21 సీట్లకు పరిమితం అయింది. 2018 ఎన్నికల్లో 19 సీట్లు మాత్రమే సాధించింది. ఇలా చూసుకుంటే 1989 కానీ 2004, 2009లో కానీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏపీ సీట్లూ ఓట్లే కారణం అని అర్ధం అవుతోంది. అంటే కాంగ్రెస్ కి అసలైన బలం తెలంగాణాలో కంటే ఏపీలోనే ఉంది అని కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంది.

అలాంటిది ఈసారి కాంగ్రెస్ 119 సీట్లలో వందకు పైగా సీట్లు సాధిస్తుంది అని చెబుతున్నా సింపుల్ మెజారిటీని చేరుకుంటుందా అన్నది చూడాలని అంటున్నారు. కాంగ్రెస్ కి మూడున్నర దశాబ్దాలలో ఇలా ఎందుకు జరుగుతోంది, ఎక్కడ లోపం ఉంది అన్నది కనుక తెలుసుకుని జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ మెజారిటీ సాధించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.