Begin typing your search above and press return to search.

త‌న బాధ‌ను దేశం బాధ చేస్తున్న కాంగ్రెస్‌.. నిజ‌మేనా...!

ఎట్టి ప‌రిస్థితిలోనూ మోడీని పీఎం పీఠం నుంచి దింపేయాల‌న్న‌ది కాంగ్రెస్ దండ‌లో దారంలా పెట్టుకున్న కీల‌క ల‌క్ష్యం.

By:  Tupaki Desk   |   19 July 2023 6:56 AM GMT
త‌న బాధ‌ను దేశం బాధ చేస్తున్న కాంగ్రెస్‌.. నిజ‌మేనా...!
X

ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడితే.. ఉలుకు ఖాయమే! అయినా.. జ‌నంలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను మాత్రం ఎవ రూ తోసిపుచ్చ‌లేరు క‌దా? ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింప‌డ మే ల‌క్ష్యంగా దేశంలోని విప‌క్షాలు ఏక‌మ‌య్యాయి. చేతులు క‌లిపాయి.

మొత్తంగా 26 పార్టీలు మోడీపై క‌త్తి దూస్తున్నాయి. అక్క‌డ మోడీనే వారి ప్ర‌ధాన అస్త్రం. నిజానికి దేశంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటి కోస‌మే చేతులు క‌లుపుతున్నామ‌ని.. ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించుకునేందుకు ఒక్క‌ట‌వుతున్నామ‌ని చెబుతున్నా.. అవ‌న్నీ అస‌లు ల‌క్ష్యానికి మ‌సి పూశాయ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే.. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ‌ర్జెన్సీ విధించిన‌ప్పుడు.. కీల‌క నాయ‌కుల‌ను జైళ్ల‌లో పెట్టించిన‌ప్ప‌డు.. మీడియా స్వేచ్ఛ‌ను హ‌రించిన‌ప్పుడు.. ప్ర‌జాస్వామ్యం గురించి తెలియ‌దా.. అనేది మేధావుల మాట‌.

పోనీ.. అప్ప‌టి క‌థ ఎందుకులే అంటారా? 2004-14 మ‌ధ్య జ‌రిగిన విష‌యాలే తీసుకున్నా.. నిర్బంధంగా పార్ల‌మెం టు మూసేసి.. పెప్ప‌ర్ స్ప్రే చ‌ల్లి రాష్ట్రాన్ని విడ‌దీసిన‌ప్పుడు.. ఇరు రాష్ట్రాల‌ ప్ర‌జ‌లు ఈ దేశంలో భాగ‌మ‌ని గుర్తించ‌లేదా? ఇవ‌న్నీ కాదు.. అంటే.. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి పెంచుకునే అవ‌కాశం క‌ల్పించింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కాదా!

వంట గ్యాస్ సిలెండ‌ర్ల స‌బ్సిడీని బ్యాంకులో వేస్తామ‌ని పేర్కొంటూ.. ఉన్న స‌బ్సిడీని ఎత్తేసేలా చ‌ర్య‌లకు బీజం వేసింది కాంగ్రెస్ కాదా.. అంటే.. ఇత‌మిత్థంగా ఇప్పుడు ఉమ్మ‌డి విప‌క్ష కూట‌మికి ప్రాతినిధ్యం వ‌హిస్తూ.. పైకి 'ఇండియా' పేరు చెప్పి.. దేశం కోసం చేస్తున్నామ‌ని.. చేతులుక‌లిపామ‌ని అంటున్నా.. అస‌లు విష‌యం మాత్రం మోడీపై యుద్ధ‌మే. ఆయ‌న‌ను గ‌ద్దె దింప‌డ‌మే. రాజ‌కీయం దీనిని ఎదుర్కొన‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి ప్ర‌జ‌లు- సేవ‌-రాజ్యాంగం అనే పేరు చెప్ప‌డం ముసుగు ధ‌రించడం స‌రైందేనా? ప్ర‌శ్న‌.

సీబీఐ, ఈడీ త‌దిత‌ర సంస్థ‌ల‌ను ఇష్టానుసారంగా వినియోగిస్తూ.. రాష్ట్రాల‌పై పెత్త‌నం చేస్తున్న మోడీని గ‌ద్దె దింపాల‌నేది కాంగ్రెస్ వ్యూహం. పైగా గోవా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల్లో త‌మ‌కు అధికారం ద‌క్కినా.. కుటిల తంత్ర‌తో త‌మ స‌ర్కారును కూల‌దోసింద‌నే అక్క‌సు కాంగ్రెస్‌కు ఉంది. అదేస‌మ‌యంలో రాహుల్ పార్ల‌మెంట‌రీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసి.. ఆయ‌న‌ను అన‌ర్హుడిని చేసిన త‌ర్వాత‌.. ఈ క‌సి మ‌రింత పెరిగింది.

ఎట్టి ప‌రిస్థితిలోనూ మోడీని పీఎం పీఠం నుంచి దింపేయాల‌న్న‌ది కాంగ్రెస్ దండ‌లో దారంలా పెట్టుకున్న కీల‌క ల‌క్ష్యం. అయితే.. త‌న బాధ‌ను దేశం బాధ చేస్తే.. వ‌ర్కవుట్ అవుతుందో అవ‌దో అనే భాన‌వ‌తోనే ఇప్పుడు ఇలా ప్లేటు ఫిరాయించారా? అనే చ‌ర్చ జాతీయస్థాయిలో జోరుగా సాగుతోంది.