Begin typing your search above and press return to search.

వలస పక్షుల గూడుగా కాంగ్రెస్

మరోసారి టికెట్ దక్కకపోవడంతో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 7:50 AM GMT
వలస పక్షుల గూడుగా కాంగ్రెస్
X

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వలస పక్షుల గూడుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు భారీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశించి భంగపడ్డ కీలక నేతలు, నాయకులు, బీజేపీలో ప్రాధాన్యత దక్కని లీడర్లు..ఇలా ఇప్పుడు వీళ్లందరి గమ్య స్థానం కాంగ్రెస్గా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందరి చూపు కాంగ్రెస్ పైనే ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎన్నికల రేసులో కాంగ్రెస్ పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముందని టాక్. మరోవైపు బీజేపీకి తెలంగాణలో క్రమంగా గ్రాఫ్ తగ్గిపోతుందని అంటున్నారు.

పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డిని నియమించడమే దెబ్బ తీసిందనే వ్యాఖ్యలూ వినిపినిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని భావన ప్రజల్లోకి వెళ్లిందని టాక్. అందుకే రాజకీయ అవకాశాల కోసం నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అసంత్రుప్తితో పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి క్రిష్ణారావు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. మరోసారి టికెట్ దక్కకపోవడంతో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టికెట్ కోసం కాంగ్రెస్లో దరఖాస్తు సమర్పించారు కూడా.

మరోవైపు బీజేపీ మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సీతాదయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతానంటున్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయి. ఇక షర్మిల ఏకంగా తన పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి.