Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ Vs బీఆర్‌ఎస్సేనా.. బీజేపీ గ్రాఫ్ డౌన్ ఫాల్!

ఫైనల్లీ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాడి సీట్లు సాధించి జెండా ఎగురవేసింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 8:30 PM GMT
కాంగ్రెస్ Vs బీఆర్‌ఎస్సేనా.. బీజేపీ గ్రాఫ్ డౌన్ ఫాల్!
X

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన సాగింది. పదేళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పది నెలలు కూడా పూర్తయింది. అయితే.. రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఫైనల్లీ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాడి సీట్లు సాధించి జెండా ఎగురవేసింది.

పది నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. రేవంత్ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంది. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ ‌పై నిరసనరాగం వినిపిస్తూనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉంది. ప్రధానంగా రైతు సమస్యలపై, ఆరు గ్యారంటీలపై, నిరుద్యోగంపై విమర్శలు గుప్పించారు.

అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పోరాడుతున్నా బీజేపీకి అంత మైలేజీ రావడం లేదన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్‌ను నిలదీయడంలో బీఆర్ఎస్ పైచేయి సాధిస్తున్నట్లుగానే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీకి ఉన్న ఊపు ఇప్పుడు లేదన్న టాక్ పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. దీనికితోడు ఇటీవల బీజేపీలో సొంత పార్టీ నేతలే అసమ్మతి రాగం వినిపించారు. అందులోనూ సీనియర్ నేతల మధ్య కూడా సఖ్యత లోపించినట్లుగా ప్రచారం. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోయినట్లుగానే తెలుస్తోంది. నాయకత్వలోపం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. అటు రాష్ట్ర అధ్యక్షుడి పంచాయితీ కూడా కొనసాగుతుండడంతో ఆ పార్టీ పట్టు కోల్పోతున్నట్లుగా సమాచారం.

ఇక.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయినప్పటి నుంచి సైలెంటుగానే ఉండిపోయారు. పది నెలలుగా ఆయన ఫామ్‌హౌజ్‌లోనే ఉండిపోయారు. దాంతో ఆయన ఇంతవరకు మాట్లాడింది లేదు. కానీ.. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో కీలక నేత హరీశ్ రావు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. నిత్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అటు ట్విట్టర్ వేదికగానూ నిత్యం ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా కాంగ్రెస్‌పై యుద్ధం చేస్తున్నప్పటికీ ఎక్కువ మైలేజీ మాత్రం గులాబీ పార్టీకే వస్తున్నదన్న టాక్ వినిపిస్తోంది. ప్రజలు కూడా ఎక్కువ అదే పార్టీని నమ్ముతున్నారన్న తెలుస్తోంది. అందుకు ఇటీవల మూసీ బాధితులు బీఆర్ఎస్ నేతలను కలిశారు. తమకు మద్దతుగా వచ్చి.. తమ తరఫున పోరాడాలని విన్నించారు. అలాగే.. నిన్న గ్రూప్ 1 అభ్యర్థులు కూడా బీజేపీ నేతల వద్దకు కాకుండా బీఆర్ఎస్ నేతలనే ఆశ్రయించారు. దాంతో బీజేపీ నేతలు డీలా పడిపోయారు. ప్రజాక్షేత్రంలో ఇంతలా ప్రజల కోసం కొట్లాడుతున్నా మైలేజీ రావడం లేదే అని అంతర్మథనం మొదలైంది.

దీంతో భవిష్యత్తులోనూ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగానే రాజకీయాలు నడువబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కూడా ప్రజల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండడంతో.. రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు లేకపోలేదు. అటు కాంగ్రెస్ పాలన కూడా ఏడాది పూర్తిచేసుకోబోతున్న తరుణంలో బీఆర్ఎస్ మరింత ప్రణాళికతో వెళ్లేందుకు కత్తులు నూరుతున్నట్లుగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీకి గతంలో ఉన్న ఊపు లేకపోవడంతోనే ప్రజలు బీఆర్ఎస్‌పై నమ్మకాలు పెట్టుకుంటున్నట్లుగా సమాచారం. అందుకే నిన్న కేటీఆర్ సైతం బీఆర్ఎస్వీ నేతలతో సమావేశం అయిన సమయంలోనూ అదే చెప్పారు. ప్రజలంతా ఇప్పుడు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయాలు మారబోతున్నాయని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.