Begin typing your search above and press return to search.

టీపీసీసీ చీఫ్ పై పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్.. ఆయనకే పదవి

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటూ తన పంతం నెగ్గించుకున్న నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే.

By:  Tupaki Desk   |   26 Aug 2024 10:35 AM GMT
టీపీసీసీ చీఫ్ పై పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్.. ఆయనకే పదవి
X

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటూ తన పంతం నెగ్గించుకున్న నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే. అంతకుముందు కాసు బ్రహ్మానంద రెడ్డి ఇలా మాట బలమైన నాయకుడిగా ఉండేవారని చెబుతారు. అయితే, ఇప్పటి తరంలో ఆ స్థాయి గల నాయకులు కష్టమే. కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి నియమాకంలో రేవంత్ తన ముద్ర చూపారనే మాట వినిపిస్తోంది. సుదీర్ఘ తర్జన భర్జనల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియమాకాన్ని త్వరలో ప్రకటించనుందనే మాట వినిపిస్తోంది.

బీసీకే.. కానీ రేవంత్ చాయిస్ కే..

రేవంత్ మాటను గౌరవిస్తూనే.. డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అభిప్రాయానికి విలువిస్తూనే.. కొత్త అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన నాయకుడికి పగ్గాలు ఇవ్వనున్నట్లు సమాచారం. చివరి వరకు పలువురు పోటీ పడినా.. సీఎం రేవంత్ సూచించిన నాయకుడి వైపు అధినాయకత్వం మొగ్గు చూపిందని చెబుతున్నారు. సోమ లేదా మంగళవారాల్లో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. కాగా, బీసీ, గిరిజన, ఎస్సీ నేతల నుంచి ముగ్గురి పేర్లపై ప్రధానంగా చర్చ జరిగిందని.. బీసీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అదికూడా రేవంత్ సూచించిన నాయకుడికే పగ్గాలు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

ఆయనకేనా..?

సీఎం రేవంత్ అభిప్రాయానికి విలువిచ్చిన కాంగ్రెస్ హై కమాండ్.. టీపీసీసీ చీఫ్ గా కొత్తగా ప్రజాప్రతినిధి అయిన నాయకుడికే అవకాశం ఇస్తుందని సమాచారం. ఈయన సామాజిక వర్గానికే చెందిన మాజీ ప్రజాప్రతినిధి పోటీ పడినప్పటికీ.. రేవంత్ ఎంపిక ప్రకారం కొత్త నాయకుడికే ఓటు వేసినట్లు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు.. 2028 లక్ష్యంగానూ ఈ ఎంపిక చేపట్టినట్లు సమాచారం.

ఇంతకూ ఎవరా చాయిస్?

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపిక ఎవరై ఉంటారు? అనేది చూస్తే.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఇటీవలే ఎమ్మెల్సీ అయిన బొమ్మ మహేష్ గౌడ్ అని తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చినప్పటినుంచి పీసీసీ అధ్యక్షుడు, సీఎం అయిన సమయంలోనూ మహేష్ పూర్తి మద్దతు పలికారు. రేవంత్ కు వ్యతిరేకంగా గళం వినిపించినవారిని అడ్డుకున్నారు. దీంతో తన లక్ష్యాలకు తగినట్లుగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్.. టీపీసీసీ చీఫ్ గా మహేష్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా, రేవంత్ దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నుంచి అనేక హోదాల్లో మహేష్ కాంగ్రెస్ లో పనిచేశారు. జనవరిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.