టీ-పాలిటిక్స్: చేరడం-చేర్చుకోవడం మధ్య.. నైతికత మాటేంటి?
ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్.. తారా జువ్వలా దూసుకుపోయింది.
By: Tupaki Desk | 6 July 2024 12:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కుదుపులపై కుదుపులు ఏర్పడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓ డిన బీఆర్ ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటోంది. రాజకీయాల్లో జంపింగులు కామనే అయినా.. ఇప్పుడు మారుతున్న కాలంలో జనాలు అన్నీ గమనిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దూకుడును వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి సహా.. ఏడుగురు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి తన వైపు తీసుకున్నారు.
ఇలా చేయడంపై తెలంగాణ సమాజంలోనే ఒక విధమైన చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్.. తారా జువ్వలా దూసుకుపోయింది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చిన ప్పుడు.. అందరూ హర్షించారు. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా.. హర్షించా రు. అయితే.. ఇప్పుడు అదే జనాలు.. జంపింగుల విషయంపై విస్తు బోతున్నారు. గురువారం అర్ధరాత్రి.. అరడజను మంది ఎమ్మెల్సీలను తనవైపు తిప్పుకొని కండువా కప్పేశారు రేవంత్.
ఈ పరిణామం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఇదే తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. ఒకప్పుడు బీఆర్ ఎస్ ఇలానే విలీనం ప్రతిపాదించినప్పుడు.. కాంగ్రెస్ నేతలు.. తూర్పారబట్టారు. భట్టి విక్రమార్గ.. అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. కావాల్సినంత బలం ఉన్నప్పుడు.. ఇలా లాక్కోవడం ప్రజాస్వామ్యమేనా? అని గద్దించారు. అంతేకాదు.. ఓ వర్గం మేధావులు కూడా.. కేసీఆర్ చేసిన చర్యలను తప్పుబడుతూ.. నైతికతను ప్రశ్నార్థకం చేస్తున్నారంటూ.. విమర్శలు గుప్పించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే నైతికత ప్రశ్న కాంగ్రెస్‌వైపు మళ్లింది. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం.. సంఖ్యా బలం కూడా ఉన్నప్పుడు.. ఇలా ఎగువ, దిగువ సభల్లో కేసీఆర్‌ను ఖాళీచేసి.. రేవంత్ సాధించేది ఏంటనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. కేసీఆర్‌ను ఎంత బలహీనుడిని చేస్తే.. ఆయన పట్ల అంత సింపతీని పెంచినట్టేనన్నది మేధావులు చెబుతున్న మాట.
పైగా.. కేసీఆర్‌ను బలహీనుడిని చేసిన తర్వాత.. పోన్ ట్యాపింగ్ సహా.. ప్రాజెక్టుల అవినీతి కేసులను ఏకరువు పెట్టినా.. ప్రయోజనం ఉండదని.. ఇది రేవంత్ కు యాంటీ అవుతుందని కేసీఆర్ మరింత జోరుగా ప్రజల మధ్యకు వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. చేరికలు-చేర్చుకోవడాలకు మధ్య నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా! అన్న ప్రశ్నకు రేపు రేవంత్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.