కాంగ్రెస్ లో కొత్త టెన్షన్ @ జూబ్లీహిల్స్ నియోజకవర్గం!
ఎన్నికలు సమీపిస్తున వేళ తెలంగాణ కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో తొలి విడత జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Oct 2023 1:04 PM GMTఎన్నికలు సమీపిస్తున వేళ తెలంగాణ కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో తొలి విడత జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గ్రేటర్ పరిధిలోని కీలకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా ఒక విషయం తెరపైకి వచ్చింది.
అవును... జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందనే అనుకోవాలి. అయితే... మొదటి జాబితాలో ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ... ఈ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి.. మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు.
ఈ ఇద్దరూ ఎవరికివారే తమకే టిక్కెట్ అంటే తమకే టిక్కెట్ అని భావిస్తున్నారని, ఇందులో భాగంగానే నియోజకవర్గంలో తమ తమ ప్రచారాలను జోరుగా చేసేసుకుంటున్నారని అంటున్నారు. చేసేసుకుంటున్నారు. ఇదే సమయంలో స్థానిక డివిజన్ల నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. అదేవిధంగా బస్తీలలోనూ భేటీలు కండక్ట్ చేస్తున్నారు. అయితే తొలి జాబితాలో ఈ నియోజకవర్గం అభ్యర్థి పేరు వెల్లడించలేదు!
అయితే తుది జాబితాలో కచ్చితంగా తమ పేరు ఉంటుందని.. మళ్లీ అదే నమ్మకంతో చెబుతున్నారు ఈ ఇద్దరు నేతలు. సరిగ్గా ఈ సమయంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అజహరుద్దీన్ పనిచేసినప్పుడు అవినీతి జరిగిందని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి! దీంతో అజహరుద్దీన్ కు సీటు ఇచ్చే విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
దీంతో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు మరింత కాన్ ఫిడెన్స్ గా ఉన్నారని అంటున్నారు. అయితే... ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... దాదాపు లక్షకుపైగా మైనార్టీ ఓట్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజహరుద్దీన్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ కలిసివస్తుందని భావించింది. అయితే... అజర్ విషయంలో ఈ ట్విస్ట్ తెరపైకి రావడంతో... మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో ఎవరూ, మరి ముఖ్యంగా విష్ణు వర్ధన్ రెడ్డి అనుచరులు ఊహించని రీతిలో కాంగ్రెస్ అధిష్టానం మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఎంఐఎం నుంచి ఒకసారి, స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి పోటీచేసిన నవీన్ యాదవ్ ను ఢిల్లీకి పిలిపించింది! దీంతో... విష్ణు టీం కొత్త టెన్షన్ లో ఉందని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే టిక్కేట్ ఇవ్వడం కోసం కాదు.. కాంగ్రెస్ కు సపోర్ట్ చేయమని అడగడానికే అని అంటున్నారు.
ఇందులో భాగంగా... జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే... ఎంపీ టిక్కేట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నవీన్ యాదవ్ కు తెలిపారని అంటున్నారు. అయితే... టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ లో ఉంటానని, లేదంటే.. ఎంఐఎం లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ధీమాగా వారికి చెప్పారని కథనాలొస్తున్నాయి. దీంతో ఈ స్థానం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతొంది.. ఎవరికి టిక్కెట్ ఇవ్వబోతోంది అనేది వేచి చూడాలి!