Begin typing your search above and press return to search.

తెలంగాణను కర్ణాటక చేసెయ్యాలనుకుంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది.

By:  Tupaki Desk   |   18 Sept 2023 6:00 AM IST
తెలంగాణను కర్ణాటక చేసెయ్యాలనుకుంటున్న కాంగ్రెస్
X

దేశంలో, దాంతోపాటుగా ఆయా రాష్ట్రాల‌లో ఇటీవల కాలంలో ఒకింత‌ బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే విపక్షాల ఐక్యతకు కూటమిని ఏర్పాటు చేసింది. ప్రాంతీయ పార్టీల‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఆయా రాష్ట్రాల‌లో బ‌ల‌ప‌డే గేమ్ ప్లాన్ అమ‌లుప‌రుస్తోంది. ఇందులో భాగంగా, తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులు చర్చ‌నీయాంశంగా మారాయి. లాజిక్ మిస్స‌యి కాంగ్రెస్ ముందుకు సాగిందా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉచిత పథకాలు, ఆక‌ర్ష‌ణీయ హామీలు ఇచ్చి కర్ణాటకలో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం తెచ్చుకునేందుకు అదే ఫార్ములాను అమ‌లు ప‌రుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. ఆ ఆరు గ్యారంటీలు :

1. మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.

2. రైతుభరోసా – రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.

3. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.

4. ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.

5. యువ వికాసం – విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.

6. చేయూత – నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆక‌ర్ష‌ణీయంగా ఉండటం అధికారం కోసం ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఆశ‌ను రేకెత్తిస్తుంద‌ని ప‌లువురు అంటున్నారు. అయితే ఈ హామీల విషయంలో కర్ణాటకలో జరిగిన పరిణామాలు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మర్చిపోతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు అనంతరం ఆ హామీలను అమ‌లుచేసే సమయంలో ఎంత అబాసు పాలయిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారం చేతికించుకునేందుకు అన్ని వ‌ర్గాలను సంతృప్తి ప‌రిచేందుకు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పరిపాలనకు పెద్ద సవాలుగా మారిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు సైతం అంతర్గతంగా అంగీకరిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే తెలంగాణలో అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ భారీ హామీ ఆ పార్టీని అధికారంలోకి తెస్తాయా అనే విషయం అటు ఉంచితే, ఒకవేళ అధికారంలోకి వస్తే ఖ‌జానాపై ఊహించ‌నంత‌ భారం పడటం మాత్రం ఖాయ‌మ‌ని విశ్లేషకులు పేర్కొంటున్నారు