రేవంత్ వేటు ఎవరిపైన ?!
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే సస్పెండ్ చేయడం రేవంత్ ఉద్దేశం అన్న వాదన వినిపిస్తున్నది.
By: Tupaki Desk | 4 Aug 2024 7:15 AM GMT‘తెలంగాణ శాసనసభ నుండి ఒక ఐదారుగురిని సస్పెండ్ చేస్తే అంతా సమసిపోతుంది’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి ? అసలు రేవంత్ శాసనసభకు రాకుండా చేసే ఐదారుగురు మంది శాసనసభ్యులు ఎవరు ? అన్నది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే సస్పెండ్ చేయడం రేవంత్ ఉద్దేశం అన్న వాదన వినిపిస్తున్నది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుండి ధీటైన ప్రశ్నలు, సమాధానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం రేవంత్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, కోమటిరెడ్డి సోదరులు మినహా మిగిలిన మంత్రులు తమ శాఖల అంశాల మీదనే స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాదనకన్నా బీఆర్ఎస్ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్న భావన కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ లో ఉంది. గతంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లు హెడ్ ఫోన్లను విసిరికొట్టి దాడి చేయడంతో గవర్నర్ పక్కన ఉన్న అప్పటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు దెబ్బతగిలింది. దీంతో వారిద్దరిని సమావేశాల నుండి పూర్తిగా బహిష్కరించారు.
దానిని ఆసరాగా చేసుకుని శాసనసభ సమావేశాలలో బలంగా వాణిని వినిపిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులను సభ నుండి పూర్తిగా సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ వాదన బలహీనపడుతుంది అన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తుంది.
దీంతో శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు అన్న అంశం మీద ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కూడా సస్పెండ్ చేయాలన్న మరో ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సభలో ఎక్కడా బీఆర్ఎస్ నేతలు నిరసన తెలియజేయడం తప్ప దాడులకు యత్నించిన దాఖలాలు లేవు. స్పీకర్ విచక్షణ పరిధిలోనే సస్పెన్షన్ అవకాశం ఉంటుంది. మరి రేవంత్ మాటల వెనక అంతరార్దం ఏమిటి ? ఎవరిని సస్పెండ్ చేస్తారు ? ఎంతకాలం సస్పెండ్ చేస్తారు ? అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నది.