Begin typing your search above and press return to search.

రేవంత్ కు కాలు అడ్డం పెట్టింది ఆ నలుగురేనా?

కుర్చీ కుమ్ములాటలో కాంగ్రెస్ కు మించిన పార్టీ మరొకటి ఉండదన్న మాటను మరోసారి నిజం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు

By:  Tupaki Desk   |   5 Dec 2023 6:28 AM GMT
రేవంత్ కు కాలు అడ్డం పెట్టింది ఆ నలుగురేనా?
X

కుర్చీ కుమ్ములాటలో కాంగ్రెస్ కు మించిన పార్టీ మరొకటి ఉండదన్న మాటను మరోసారి నిజం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఫలితాలు అంచనాలకు తగ్గట్లే వచ్చిన వేళ.. ఆ క్రెడిట్ ను రేవంత్ ఖాతాలో వేసి.. ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉన్నప్పటికి తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నలుగురు సీనియర్ నేతలు అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఫలితాలు వెలువడిన ఆదివారం రాత్రే రేవంత్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి అంతా రెడీ చేసినప్పటికి కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు.

ముఖ్యమంత్రిని ఎంపిక చేయటానికి ప్రాసెస్ మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అంతకు ముందే అధిష్ఠానం మనసులో రేవంత్ ఉన్నారు. అయినప్పటికీ ఎప్పటి నుంచో అలవాటులో ఉన్న ప్రక్రియను తెర మీదకు తీసుకొచ్చారు. ఇందుకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వేదికగా మారింది. సీఎం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా డీకే శివకుమార్.. బోసు రాజు.. అజయ్ కుమార్.. జార్జి.. దీపా దాస్ మున్షీలను కాంగ్రెస్ అధినాయకత్వం నియమించింది. ఈ భేటీకి ముందు తాజ్ క్రిష్ణలో బస చేసిన డీకే శివకుమార్.. పార్టీకి కీలకమైన ఐదుగురు నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు.

వారిలో భట్టి విక్రమార్క.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దామోదర రాజనర్సింహా.. కోమటిరెడ్డి సోదరులతోపాటు శ్రీధర్ బాబు ఉన్నారు. వీరిలో భట్టి.. ఉత్తమ్.. దామోదర రాజనర్సింహా.. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లుగా చెబుతూ తమ ఆసక్తిని వెల్లడించారు. తమకే ముఖ్యమంత్రి పదవిని ఎందుకు ఇవ్వాలన్న దానిపైనా కొన్ని అంశాల్ని పేర్కొంటూ డీకే ముందు తమ వాదనల్ని వినిపించారు. ఇదిలా ఉంటే.. సీతక్కకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని.. కొందరు ఎమ్మెల్యేలు చెబుతూనే.. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ సులువుగా కాకుండా సంక్లిష్టంగా మారింది. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ కు పోటీగా మరో నలుగురు బరిలోకి రావటంతో.. ఎంపిక వ్యవహారం ఇబ్బందిగా మారింది. దీంతో.. అభ్యర్థి ఎంపికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. రేవంత్ ప్రవేశ పెట్టిన ఈ ఏకవాక్య తీర్మానానికి భట్టి. ఉత్తమ్ తో పాటు మిగిలిన ముఖ్యనేతలంతా ఓకే అనటంతో ఒక సమస్య తీరినట్లైంది.

మంగళవారం నుంచి బుధవారం వరకు మంచి రోజులు లేని నేపథ్యంలో సోమవారం రాత్రికి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్నిపూర్తి చేయాలని భావించినా.. ఆ నలుగురి పుణ్యమా అని సీఎం ఎంపిక వ్యవహారం పీటముడి పడింది. దీంతో.. పీటముడిని సున్నితంగా విప్పటమే మంచిదని.. తొందరపాటు వద్దన్న పార్టీ అధినాయకత్వం సూచనతో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని కాస్త ఆలస్యంగా చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు.మంచి రోజులు లేకపోవటంతో.. ఏడో తారీఖు ఉదయం పది గంటలకు ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు పంపారు.

నిజానికి సోమవారం రాత్రి 8 గంటల వేళలో రాజ్ భవన్ లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసినప్పటికీ.. అందుకు సిద్ధంగా కాంగ్రెస్ లేకపోవటంతో.. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నిజానికి సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని.. సోమవారం మధ్యాహ్నం సాధారణ పరిపాలనా విభాగంనుంచి కొందరు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లినప్పటికీ.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. సీఎంగా రేవంత్ రెడ్డినే డిసైడ్ చేశారని.. కాకుంటే అందరిని ఒప్పించి.. నిర్ణయాన్ని వెల్లడించాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.