Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కొత్త డిమాండ్..పట్టించుకుంటారా ?

పీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ 'మా రాజధాని..మాకు కావాలి' అనే సరికొత్త డిమాండును వినిపించారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 6:26 AM GMT
కాంగ్రెస్ కొత్త డిమాండ్..పట్టించుకుంటారా ?
X

ఉనికిని కూడా చాటుకోలేకపోతున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ కొత్త డిమాండును తెరపైకి తెచ్చింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ 'మా రాజధాని..మాకు కావాలి' అనే సరికొత్త డిమాండును వినిపించారు. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని ఏ జిల్లాలో రాజధానిని ఏర్పాటుచేయాలని చెప్పకపోయినా ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోతోంది. ఒకపుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. కాబట్టి మళ్ళీ కర్నూలును రాజధానిగా ప్రకటించాలన్నది ఆయన డిమాండ్ కావచ్చు.

అయితే ఈ విషయాన్ని శైలజనాధ్ స్పష్టంగా చెప్పలేదు. ఏదేమైనా కాంగ్రెస్ ను ఇపుడు జనాలు ఎవరు పట్టించుకోవటం లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అని చెప్పుకునేందుకు మాత్రమే నేతలు ఇలాంటి ప్రకటనలు, డిమాండ్లు చేస్తుంటారు. గడచిన రెండు ఎన్నికల్లో పార్టీ తరపున డిపాజిట్లు తెచ్చుకున్న నేతలే లేరు. రాబోయే ఎన్నికల్లో పరిస్ధితిలో ఎలాంటి మార్పుండదనే అనుకోవాలి. ఎందుకంటే పచ్చగా కళకళలాడుతున్న రాష్ట్రాన్ని విభజన పేరుతో నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ.

చేసిన విభజనను కూడా అడ్డుగోలుగా చేసేసింది. ఆస్తులు, ఆదాయార్జన సంస్ధలు, కేంద్ర ప్రభుత్వ సంస్ధలన్నింటినీ తెలంగాణాకు కేటాయించేసింది. అప్పులు, రెవెన్యూలోటు, హామీలను మాత్రం ఏపీకి ఇచ్చింది.

దాంతో విభజన కన్నా విభజన చేసిన తీరుమీద జనాలు బాగా మండిపోయారు. మెజారిటి జనాల మనోభావాలను పట్టించుకోని కాంగ్రెస్ పైన జనాలు బాగా కసిపెంచుకున్నారు. ఆ కసినే ఎన్నికల సమయాల్లో చూపిస్తున్నారు. తనంతట తానే పార్టీకి ఏపీలో అధిష్టానం సమాధి కట్టేసింది.

అన్ని విధాలుగా ఏపీని దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ అంటే జనాల్లో కసి ఇంకా తీరలేదు. ఈ విషయాలేమీ తెలీనట్లు, గమనించనట్లుగా హస్తం పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. నేతలు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్నికల్లో ఓట్లు వేయాల్సింది జనాలే కదా. అందుకనే కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రానీయకుండా ఇతర పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శైలజానాధ్ అయినా మరోకళ్ళు అయినా జనాల్లో గుర్తింపుకోసం నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. వీళ్ళెంతమాట్లాడినా జనాలు వీళ్ళుగురించి పట్టించుకునే అవకాశమే లేదు.