అధికారంలోకి రాగానే 'రోహిత్ వేముల ఆక్ట్' అమలు చేస్తాం: కాంగ్రెస్ మేనిఫెస్టో
ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికగా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు.
By: Tupaki Desk | 5 April 2024 9:51 AM GMTసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయ్‌పత్ర-2024 పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిలో 5 న్యాయ పథకాలు, 25 హామీలను పేర్కొన్నారు. మొత్తం 48 పేజీలతో మేనిఫెస్టోను రూపొందించారు. కొత్త దిల్లీలో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువులు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికగా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. ఇక, మేనిఫెస్టోలో ప్రధానంగా పార్టీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఆసుపత్రులు నిర్మిస్తామని తెలిపారు. యూనివర్సిటీలలో వివక్షకు గురవుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు 'రోహిత్ వేముల ఆక్ట్' అమలు చేస్తామని చెప్పారు.
వెనకబడిన పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం.. బ్యాంకు అకౌంట్‌లో జమ చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, కస్తూర్బా గాంధీ పాఠశాల పాఠశాలల పెంపును ఖర్గే ప్రకటించారు.
ఇవీ.. మేనిఫెస్టో హామీలు..
ఎం.ఎస్ స్వామినాథన్ సిఫారసు మేరకు రైతులకు కనీస మద్దతు ధర. ఎంఎస్ పి డైరెక్ట్‌గా రైతులకు కేంద్రాలలో ఇస్తాం, రైతు రుణాలకు ప్రత్యేక కమిషన్. నూతన వ్యవసాయ చట్టాలను అధికారం రాగానే తీసేస్తాం. ఉపాధి హామీ పథకంలో రోజు వారి వేతనం 400 వందలకు పెంపు. పట్టణాలలో అర్బన్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం.
సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఖాళీల భర్తీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు. పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష అందిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం. కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటాం. పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకువస్తాం.రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తాం.