కాంగ్రెస్ పార్టీకి సేఫ్ లాకర్ గా మారిన హైదరాబాద్
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ వేదికగా మారింది.
By: Tupaki Desk | 5 Feb 2024 4:42 AM GMTఒకప్పుడు దేశంలో ఏ మూలన చూసినా కాంగ్రెస్ పార్టీ ఏలుబడి రాష్ట్రాలే కనిపించేవి. మోడీ పుణ్యమా అని సీన్ మొత్తం ఛేంజ్ అయ్యింది. కిందా మీదా పడినా కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయలేకపోతోంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమైనవి కర్ణాటక, తెలంగాణ మాత్రమేనని చెప్పాలి. కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు ఈ రెండింటితో పోలిస్తే వాటి స్థాయి ఇట్టే అర్థమవుతుంది.
అయితే.. కర్ణాటక.. తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం పార్టీ పేరు కంటే కూడా.. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతల ఉమ్మడి కష్టమే పార్టీని అధికారంలోకి తెచ్చేలా చేసిందని చెప్పాలి.
గడిచిన వారం వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. దీనికి కారణం.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని సేఫ్ గా దాచేందుకు హైదరాబాద్ కు మించి కాంగ్రెస్ కు మరో ఆప్షన్ కనిపించని పరిస్థితి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ వేదికగా మారింది.
మొన్నటికి మొన్న జార్ఖండ్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ కు రావటం.. శివారులోని ఒక రిసార్టులో ఉండటం తెలిసిందే. వారు తిరిగి తమ రాష్ట్రానికి వెళ్లిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే బిహార్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకోవటం ఆసక్తికరంగా మారింది.
ఇదంతా చూస్తే.. హైదరాబాద్ ను కాంగ్రెస్ పార్టీ సేఫ్ లాకర్ గా ఫీల్ అవుతున్నట్లుగా చెప్పాలి. ఈ రెండు ఎపిసోడ్లలోనూ కాంగ్రెస్ అధినాయకత్వం ఏం కోరుకున్నదో అదే జరగటంపై వారు హ్యాపీగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్ సైతం భారీగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. జార్ఖండ్.. బిహార్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ రేవంత్ కు పార్టీలో మరింత బలం పెరిగేలా చేసిందని చెప్పక తప్పదు.