‘మహాలక్ష్మి’ రెడీ అవుతోందా ?
ఇందులో అర్హులైన పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ రు.
By: Tupaki Desk | 15 Feb 2024 9:30 AM GMTమహాలక్ష్మి పథకంలో రు. 500 కే గ్యాస్ సిలిండర్ లాంచ్ అవ్వటానికి రంగం సిద్ధమవుతోందా ? ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిక్స్ గ్యారెంటీస్ అని కొన్ని పథకాలను హామీ ఇచ్చింది. ఈ సిక్స్ గ్యారెంటీస్ లో రెండు పథకాలు ఆరోగ్యశ్రీ పరిధిని రు.10 లక్షలకు పెంచటంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చింది. మిగిలిన నాలుగు హామీల అమలుకు కసరత్తు చేస్తోంది.
ఇందులో అర్హులైన పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ రు. 500కే అందించే పథకం అమలుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ఈనెల 7వ తేదీ నుండి మొత్తం రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలతో పాటు పట్టణాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇంటింటి సర్వే మొదలుపెట్టింది. ఈ సర్వేలో గ్రామ పంచాయితీలోని వార్డు నుండి మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డు వరకు ప్రతి వార్డుకు ముగ్గురు చొప్పున సిబ్బంది ప్రతి ఇల్లు తిరుగుతున్నారు.
ఇప్పటికే గ్యాస్ వాడుతుంటే గ్యాస్ కంపెనీ పేరు, ఏజెన్సీ అడ్రస్, సర్వీసు నెంబర్, ఖాతాదారుడి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ లాంటి అనేక వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా ఖాతాదారులు ఏడాదికి ఎన్ని సిలండర్లు వాడుతున్నారన్న విషయం తెలుస్తుంది. ప్రజాపాలనలో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను ఇంటింటి సర్వే ఆధారంగా ప్రభుత్వం క్రాస్ చెక్ చేస్తోంది.
గ్రామస్ధాయిలో పంచాయితీ కార్యదర్శి నుండి ఎంపీడీవోలు, ఎంఆర్వోలు, ఆర్డీవోలతో పాటు జిల్లాల కలెక్టర్లు కూడా ప్రత్యేక యాప్ ద్వారా దరఖాస్తులను, ఖాతాదారులను పర్యవేక్షిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాత నిజమైన అర్హులు ఎవరనే విషయాన్ని ప్రభుత్వాన్ని ఫైనల్ చేయబోతోంది. ఎందుకంటే సిక్స్ గ్యారెంటీస్ పథకాల అమలులో అనర్హులకు అవకాశం లేకుండా చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. వివిధ గ్యాస్ ఏజెన్సీల దగ్గర 1.20 కోట్లమంది ఖాతాదారులున్నారు. హెచ్పీసీఎల్ దగ్గర 43.39 లక్షలు, బీపీసీఎల్ దగ్గర 29.04 లక్షలు, ఐవోసీఎల్ దగ్గర 47.96 లక్షల కనెక్షలున్నాయి. ఇవికాకుండా ప్రజాపాలనలో 90 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. మరో మూడురోజుల్లో సర్వే అయిపోతోంది. కాబట్టి వీలైనంత తొందరలోనే పథకం అమల్లోకి వస్తుందని అనుకోవచ్చు.