కాంగ్రెస్ టికెట్ కోసం ప్రముఖ నిర్మాత దరఖాస్తు!
మరోవైపు అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ సీట్లు ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
By: Tupaki Desk | 26 Aug 2023 12:26 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఇంకా కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్నారు.
మరోవైపు అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ సీట్లు ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తాను పీసీసీ అధ్యక్షుడిని అయినప్పటికీ తాను కూడా సీటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని.. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందేనని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆశావహులు భారీ ఎత్తున తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు.
కాగా ప్రముఖ నిర్మాత ఒకరు రెండు స్థానాల సీట్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, ఒకరిద్దరు హీరోలు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకూ వారు సీటు కోసం దరఖాస్తు చేయలేదు.
అయితే ప్రముఖ నిర్మాత అప్పిరెడ్డి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ స్థానాలకు దరఖాస్తు చేశారు. అప్పిరెడ్డి ఎవరో కాదు.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు. 2014, 2018లో ఉత్తమ్ సతీమణి పద్మావతి కోదాడ నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో 2014లో గెలుపొందిన ఆమె 2018లో కేవలం 750 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009, 2014, 2018ల్లో వరుసగా హుజూర్ నగర్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సృష్టించారు.
2018లో గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్ నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. దీంతో హూజూర్ నగర్ నుంచి ఉప ఎన్నికలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
కాగా నిర్మాత అప్పిరెడ్డి ఇప్పటి వరకూ తెలుగులో 'జార్జిరెడ్డి', 'అర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు', 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల రీ-రిలీజ్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రీ–రిలీజ్ చేసే సమయాలను మార్చుకోవాలని.. లేదంటే చిన్న నిర్మాతలు నష్టపోతారని వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలు రిలీజయ్యే రోజు బడా సినిమాలను రీ–రిలీజ్ చేయడం ఆపాలని విన్నవించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అయిన అప్పిరెడ్డి.. ఉత్తమ్, ఆయన సతీమణి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు దరఖాస్తు చేయడంపై ఆసక్తికర్చ చర్చ నడుస్తోంది. ఒకవేళ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఆయన సతీమణి పద్మావతి పోటీ చేస్తే వీరు ఖాళీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం కోదాడ లేదా హూజూర్ నగర్ నుంచి పోటీ చేయడానికే అప్పిరెడ్డి దరఖాస్తు చేశారని తెలిసింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హూజూర్ నగర్, కోదాడల్లో ఉత్తమ్ తోపాటు ఆయన సతీమణి గెలుపొందడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరైనా 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక సీటు ఖాళీ అవుతుంది. అప్పుడు ఉప ఎన్నికలో ఆ సీటు నుంచి నిర్మాత అప్పిరెడ్డి పోటీ చేస్తారని టాక్. అందుకే ఆయన రెండు సీట్లకు దరఖాస్తు చేశారని చెబుతున్నారు.
తాను కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడే.. కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఏదో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని అప్పిరెడ్డి చెప్పడం విశేషం. తనకు సీటు ఇచ్చినా, ఉత్తమ్ దంపతులకు సీటు ఇచ్చినా తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని అప్పిరెడ్డి స్పష్టం చేశారు.