కాంగ్రెస్‌లో కుమ్ములాట.. నిజం !
కనీసం 1 శాతం ఓటు బ్యాంకు కూడా లేని కాంగ్రెస్‌లో ఎన్నికలకు ముందు కుమ్ములాటలు తెరమీదికి వచ్చాయి.
By: Tupaki Desk | 6 May 2024 12:30 PM GMTకనీసం 1 శాతం ఓటు బ్యాంకు కూడా లేని కాంగ్రెస్‌లో ఎన్నికలకు ముందు కుమ్ములాటలు తెరమీదికి వచ్చాయి. అంతో ఇంతో బలంగా పోరాడుతుందని భావించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముందు కొందరిని ప్రకటించిన తర్వాత.. ఇటీవల అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చేశారు. ఇది ఇప్పటికే ప్రకటించిన అభ్యర్తులకు మంటెత్తేలా చేసింది. దీంతో వారంతా రెబల్స్‌గా మారారు. కనీసం.. పార్టీకి గౌరవప్రదమైన సీట్లయినా . దక్కితే.. తన హవా కొనసాగుతుందని భావించిన షర్మిలకు ఈ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది.
ఒంగోలు: ఇక్కడ నుంచితొలుత బీఆర్ గౌస్ పేరు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ, రెండు రోజుల కిందట ప్రకటించిన మూడో జాబితాలో ఒంగోలు అభ్యర్థిగా కొత్తపట్నం మండలానికి చెందిన దాసరి నాగలక్ష్మి ఖరారయ్యారు. దీంతో గౌస్ నిప్పులు చెరుగుతున్నారు. షర్మిలపైనే విమర్శలు చేస్తున్నారు.
కొండపి: ఈ సీటును తొలుత శ్రీపతి సతీష్ కు ఇచ్చారు. ఆయన కూడా నామినేషన్‌దాఖలుకు రెడీ అవుతున్న క్రమంలో అనూహ్యంగా దీనిని పసుమర్తి సుధాకర్ కు కేటాయించారు. దీంతో సతీష్ నిప్పులు చెరుగుతున్నారు. తాను పోటీ చేసే తీరుతానని చెబుతున్నారు.
కనిగిరి: కీలకమైన ఈ స్థానాన్ని తొలుత కదిరి భవానికి కేటాయించారు. దీంతో ఆమె కుటుంబం ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ, ఇప్పుడు ఆమెను కాదని.. సుబ్బారెడ్డిని నిలిపారు.
మార్కాపురం: కాంగ్రెస్ ఇచ్చిన తొలి జాబితాలో తొలిపేరు ఇక్కడిదే కావడం గమనార్హం. ఇక్కడ నుంచి షేక్ సైదాను ప్రకటించగా ఆయన ఇండియా కూటమి నాయకులతో బీ ఫారంపై నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థిగా సయ్యద్ జావీద్ అన్వర్ ను ప్రకటించారు.దీంతో సైదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముందుగానే ప్రకటించన అభ్యర్థులను కాదని మళ్లీ కొత్త అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ నాయకత్వం దూరదృష్టి లోపంతో ఆ నియోజకవర్గాల్లో ఒకరికి ఒకరు మద్దతు చేయలేని పరిస్థితి ఏర్పడింది. బలమైన క్యాడర్ లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మార్పులు మరింత ఇబ్బందిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. అంతిమంగా ఇది షర్మిలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.