Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను ఎందుకు ఎంచుకున్నారు? ఖర్గేను ప్రశ్నించిన రాహుల్!

తాజాగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మల్లికార్జున ఖర్గేకు అనూహ్య ప్రశ్నను సంధించారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 4:05 AM GMT
కాంగ్రెస్ ను ఎందుకు ఎంచుకున్నారు? ఖర్గేను ప్రశ్నించిన రాహుల్!
X

అనూహ్య ప్రశ్నలు సంధించే విషయంలో కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరు రాహుల్ గాంధీ ముందుంటారు. ఎవరేం అనుకుంటారన్న విషయాన్ని వదిలేసి.. తన మనసుకు వచ్చిన సందేహాన్ని ఆయన సూటిగా అడిగేస్తుంటారు.

తాజాగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మల్లికార్జున ఖర్గేకు అనూహ్య ప్రశ్నను సంధించారు. మీరు యువకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ను ఎందుకు ఎంచుకున్నారు? అని ప్రశ్నించారు.

దీనికి ఖర్గే నోటి నుంచి ఏమని సమాధానం వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమైంది. దీనికి ఖర్గే బదులిస్తూ.. అప్పట్లో అందరూ కాంగ్రెస్ ను వదిలేసి.. కాంగ్రెస్ ఓలో జాయిన్ అవుతున్నారని.. కానీ తనకు మాత్రం కాంగ్రెస్సే సరైన పార్టీ అనిపించిందని చెప్పారు. బడుగు.. బలహీన వర్గాల పక్షాన పని చేసేది కాంగ్రెస్ మాత్రమే అన్న ఉద్దేశంతోనే తాను పార్టీలో చేరానని చెప్పారు.

1969లో నవంబరులో పార్టీలో తాను బ్లాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని.. అలాంటి తాను ఈ రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడ్ని అయ్యానని చెప్పుకొచ్చారు. నిజమే.. కాంగ్రెస్ తప్పించి మరే పార్టీలోనూ ఇలాంటి పరిస్థితి ఉండదేమో.

పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబం అదికారికంగా ఒక్క పదవి తీసుకోకుండా.. పార్టీకి నమ్మకస్తులైన వారిని ఎంపిక చేయటం.. వారితో పార్టీని నడిపించటం అంత తేలికైన విషయం కాదనే చెప్పాలి. వచ్చే ఏడాది ఏప్రిల్.. మే లో జరిగే లోక్ సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. ఎన్నికల యుద్దానికి సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు.