కిలో రూ. 2కి "పేడ" కొంటాం... కాంగ్రెస్ "గ్యారెంటీ" హామీ!
ఇదే సమయంలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో కూడా ఏ గ్యారెంటీ ఇవ్వలేదు. ఈ సమయంలో ఈ నెల 25న ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో మాత్రం 7 గ్యారెంటీ హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
By: Tupaki Desk | 21 Nov 2023 1:15 PM GMTకర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఆ గెలుపు వాపు కాదని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఐదురాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్సా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతీ రాష్ట్రంలోనూ గ్యారెంటీ పథకాలను ప్రవేశపెడుతుంది. వాటినే ప్రచారంలో హైలైట్ చేస్తుంది!
అవును... అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏ రాష్ట్రానికారాష్ట్రానికి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా హామీలను మారుస్తూ సరికొత్త గ్యారెంటీలను ఇస్తుంది. ఇందులో భాగంగా... కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో 5 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అక్కడ సక్సెస్ అయ్యింది.
ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ లో ఎలాగూ అధికారంలో ఉండటంతో ఇక కొత్తగా ఎలాంటి గ్యారెంటీలు ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో కూడా ఏ గ్యారెంటీ ఇవ్వలేదు. ఈ సమయంలో ఈ నెల 25న ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో మాత్రం 7 గ్యారెంటీ హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన మేనిఫెస్టో ను తాజాగా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా... కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ పార్టీ ఇన్ చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధావా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సీపీ జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ లు ఈ "జన్ ఘోషణ పాత్ర" మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు ప్రకటించిన ఏడు గ్యారెంటీలు ఈ విధంగా ఉన్నాయి!
1) గృహలక్ష్మి యోజన హామీ కింద కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ. 10,000 రూపాయల గౌరవ వేతనం.
2) 1.05 కోట్ల కుటుంబాలకు రూ. 500 లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు.
3) గోదాన్ హామీ కింద పశువుల పెంపకందారుల నుండి కిలోకు రూ.2 చొప్పున పేడ కొనుగోలు.
4) ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ల్యాప్ టాప్ లేదా టాబ్లెట్.
5) ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం కోసం చట్టం.
6) ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల వరకు బీమా.
7) రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చిరంజీవి హెల్త్ ఇన్స్యూరెన్స్.