12 ఏళ్లకు.. వైఎస్ కుటుంబం మెడలో కాంగ్రెస్ కండువా
వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ అప్పటి అధ్యక్షురాలు సోనియాగాంధీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 4 Jan 2024 6:53 AM GMTఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్.. అసమ్మతి నేతగా రాజశేఖర్ రెడ్డిపై ముద్ర వేసినా.. ముఠాలు కడతారని నిందలు మోపినా.. సొంత పార్టీ నేతలే ఆయన్న ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా వైఎస్ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు. తిరుగులేని నాయకుడిగానూ ఎదిగారు. పలుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ, రెండుసార్లు పీసీసీ చీప్, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కలలుగన్నారు. అంతటి కాంగ్రెస్ వాది అనూహ్యంగా చనిపోయారు. కాంగ్రెస్ వాదిగానే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ వాదిగానే ప్రాణాలొదిలారు.
వైఎస్ కుటుంబం లేకుండా కాంగ్రెస్
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ అనే పేరుంది. బహుశా స్వాతంత్ర్యం వచ్చాక ఆ కుటుంబం నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనేనేమో? ఇక 1970ల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కు మారుపేరుగా నిలిచింది. 1980ల్లో వైఎస్ కు పీసీసీ పదవి, ఎంపీ టికెట్ ఇచ్చిన పార్టీ ఎంతగానో ప్రోత్సహించించింది.1990 ప్రారంభంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఆయన పేరే వినిపించింది. కానీ, సీనియర్ నాయకులు అడ్డుతగిలారు. ఇక 1998లో మరోసారి పీసీసీ పీఠం, 1999లో సీఎల్పీ నాయకత్వం, 2004, 2009లో సీఎం పదవి ఇచ్చి రాజశేఖర్ రెడ్డిపై అపార నమ్మకం ఉంచింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది 2009 సెప్టెంబరు 2న వైఎస్ అకాల మరణం తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.
ప్రత్యేక పార్టీ పెట్టుకున్నా కాంగ్రెస్ పేరు
వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ అప్పటి అధ్యక్షురాలు సోనియాగాంధీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే, దానికి కాంగ్రెస్ పేరు ఉండేలా, తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అనే పేరును పెట్టారు. కాగా, 2010 నుంచి క్రమంగా కాంగ్రెస్ కు దూరమైన జగన్.. 2011 మార్చి 12న వైసీపీని స్థాపించారు. అంటే.. దాదాపు 11ఏళ్లు.
మళ్లీ ఇన్నాళ్లకు
జగన్ సొంతంగా పార్టీ పెట్టకమునుపే వైఎస్ సొంత కుటుంబం కాంగ్రెస్ కు దూరమవుతూ వచ్చింది. అయితే.. వైఎస్ తమ్ముడు వివేకానందరెడ్డి మాత్రం ఉమ్మడి ఏపీలో కొనసాగారు. వైఎస్ సొంత కుటుంబసభ్యులైన భార్య విజయలక్ష్మి, కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మాత్రం కాంగ్రెస్ కు 2010 నుంచే దూరంగా ఉన్నారు. ఇక వైసీపీ పెట్టాక ఈ ముగ్గురితో పాటు వైఎస్ కుటుంబంలోని అత్యధిక శాతం సభ్యులు ఆ పార్టీతోనే ఉన్నారు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెడలో కవచ కుండలంలా కనిపించిన కాంగ్రెస్ కండువాను వీరెవరూ మెడలో వేసుకోలేదు. అయితే, రెండున్నరేళ్ల కిందట తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అంటూ సొంత పార్టీ పెట్టిన షర్మిల గురువారం ఢిల్లీలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతోపాటు ఆ పార్టీ కండువాను మెడలో వేసుకున్నారు. అలా.. 12 ఏళ్ల తర్వాత వైఎస్ కుటుంబ సభ్యుల మెడలోకి కాంగ్రెస్ కండువా తిరిగొచ్చింది.