రేవంత్ ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ భారం ఇంత పడుతుందా?
ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలను ఆకట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 26 Jan 2024 3:30 PM GMTఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలను ఆకట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం వంటి రెండు గ్యారెంటీలను అమలు చేసింది. ఫిబ్రవరి నెలలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది.
అమలు చేయాల్సిన నాలుగు పథకాల్లో ఉచిత విద్యుత్ ను అందించడానికి ఉద్దేశించిన గృహజ్యోతి పథకం కూడా ఉంది. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా అన్ని పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆశగా ఉన్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్ కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఉచిత విద్యుత్ భారం ప్రభుత్వంపై భారీగానే పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నెలకు రూ.350 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేస్తున్నారు.
గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంటును ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఈ పథకంపై దృష్టి సారించింది. డిస్కంలవారీగా ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో ఆరా తీస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల పరిధిలో సుమారు కోటిన్నర కరెంట్ కనెక్షన్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో 1.2 కోట్ల ఇళ్ల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్లలోపు వాడే కనెక్షన్లు దాదాపు కోటి వరకు ఉన్నాయని అంటున్నారు.
గృహజ్యోతి పథకాన్ని అమల్లోకి తెస్తే విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. అంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని విద్యుత్ సంస్థలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మందికి లబ్ధి కలుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి నెలకు రూ.350 కోట్లు భారం పడుతుంది. కాగా ఇప్పటికే గత ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.30 వేల కోట్ల వరకు ఉన్నాయని అంటున్నారు. వీటికి తోడు పలు సంస్థల నుంచి తీసుకున్న అప్పులు మొత్తం రూ.85 వేల కోట్ల వరకు ఉన్నాయని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం కత్తి మీద సామేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌పై నిపుణులతో కమిటీ వేసి.. విధివిధానాలు రూపొందించి పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ఒకే వ్యక్తి పేరుతో రెండు మూడు విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారిని, ఆదాయ పన్ను చెల్లించేవారిని, ఉద్యోగులను, ఉన్నతాదాయ వర్గాలవారిని ఈ పథకం నుంచి మినహాయించాలని నిపుణులు కోరుతున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. మరో రెండు నెలల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తేనే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. లేకపోతే ప్రజలు తమ పార్టీని నమ్మరని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్న వినియోగదారుల వివరాలను సామాజికవర్గాల వారీగా విద్యుత్ శాఖ సేకరిస్తోందని తెలుస్తోంది.