Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీనియర్ నోట హంగ్ మాట...?

ఆయన అనాలని అనలేదు కానీ ఆయన వేరే విషయంలో చెబుతూ అన్న మాటలు మాత్రం తెలంగాణాలో హంగ్ వస్తుంది అని ప్రకటించేలా చేశాయి అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 11:57 AM GMT
కాంగ్రెస్ సీనియర్ నోట హంగ్ మాట...?
X

కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణాలో అమాంతం పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా తేడా లేకుండా డెబ్బై నుంచి ఎనభైకి పైగా సీట్లు సాధించి తీరుతామని ఆ పార్టీ బడా నాయకులు చెప్పుకుని వస్తున్నారు. అలాంటి నేపధ్యంలో కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. సీఎం రేసులో ఉన్నారని భావిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ గెలుపు గురించి కీలక వ్యాఖ్యలే చేశారా అన్న చర్చకు వస్తోంది.

ఆయన అనాలని అనలేదు కానీ ఆయన వేరే విషయంలో చెబుతూ అన్న మాటలు మాత్రం తెలంగాణాలో హంగ్ వస్తుంది అని ప్రకటించేలా చేశాయి అని అంటున్నారు. ఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నది ఏంటి అంటే వామపక్షాలతో పొత్తు ఉన్నా సీట్లు ఇవ్వవద్దని. వారికి సీట్లు ఇస్తే మాత్రం కాంగ్రెస్ నష్టపోతుందని.

వారికి చెరి రెండు సీట్లు ఇచ్చినా అక్కడికి కాంగ్రెస్ కి నాలుగు సీట్ల దాకా నష్టం వస్తుందని ఆయన అంటున్నారు. ఒక వేళ తెలంగాణలో హంగ్ వస్తే ఈ సీట్లే ప్రాణప్రదం అవుతాయని లెక్క చెప్పి భవిష్యత్తు దర్శనం ముందే చేయిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

వామపక్షాల మద్దతు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసి రేపటి రోజున కాంగ్రెస్ గెలిచాక రెండు పార్టీలకు చెరో ఎమ్మెల్సీ సీటు తో పాటు మంత్రి పదవులు కూడా ఇస్తే సరిపోతుందని కోమటి రెడ్డి కొత్త ఫార్ములాను సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలకు తాను ఇదే సూచించాను అని ఆయన అంటున్నారు.

ఇదిలా ఉంటే వామపక్ష నేతలు నల్గొండ, ఖమ్మంలలో చెరి రెండు సీట్లను కోరుతున్నారు. వారికి ఇస్తే కాంగ్రెస్ కి నష్టం అంటున్నారు కోమటి రెడ్డి. దీనిని వివరించే క్రమంలో ఆయన ఏకంగా హంగ్ వస్తుందని చెప్పేశారు. ఇదే ఇపుడు సంచలనంగా మారుతోంది. హంగ్ అంటే కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ రాదా అన్న చర్చ మొదలైంది.

అటు బీయారెస్ ఇటు కాంగ్రెస్ రెండూ పోటా పోటీగా పోరాడుతున్నాయి. హంగ్ వస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నా ఎవరూ కూడా బాహాటంగా దాన్ని ఆమోదించడంలేదు సరికదా ఫుల్ మెజారిటీ బంపర్ మెజారిటీ అని చెప్పుకొస్తున్నారు. ఇపుడు కోమటి రెడ్డి మాత్రం హంగ్ అనడంతో కాంగ్రెస్ లో కూడా చర్చ సాగుతోంది. హంగ్ వస్తుందంటే కాంగ్రెస్ కే గెలుపు ధీమా లేదా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. ఏది ఏమైనా కోమటి రెడ్డి సీట్లు కామ్రేడ్స్ కి ఇవ్వవద్దు అని చెబుతూ తమకు వచ్చే సీట్లను తగ్గించేశారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. మరి కోమటి రెడ్డి కామెంట్స్ ఏ రకమైన పరిణామలకు దారి తీస్తాయో చూడాల్సి ఉంది.