Begin typing your search above and press return to search.

తొందరలోనే రెండు డిక్లరేషన్లు!

బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అంటే నల్గొండ లాంటి జిల్లాలో బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేయించాలని ఆలోచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:18 AM GMT
తొందరలోనే రెండు డిక్లరేషన్లు!
X

ఒకవైపు అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం జరుగుతున్నా పార్టీకి ప్రచారం విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటోంది. తొందరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీకి డిక్లరేషన్లు, సిక్స్ గ్యారెంటీస్ హామీలు మంచి ఊపు తెచ్చాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటి డిక్లరేషన్లను వివిధ జిల్లాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి, మల్లికార్జున ఖర్గే తదితర ప్రముఖులతో కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించింది.

ఇదే పద్దతిలో తొందరలోనే బీసీ, మహిళా డిక్లరేషన్లను రిలీజ్ చేయించేందుకు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేయించేందుకు సీనియర్లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మహిళా డిక్లరేషన్ను ప్రియాంక గాంధి చేతుల మీదుగా ప్రకటింపచేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తదితరులు ప్లాన్ చేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అంటే నల్గొండ లాంటి జిల్లాలో బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేయించాలని ఆలోచిస్తున్నారు.

అలాగే మహిళా డిక్లరేషన్ను కొల్లాపూర్ బహిరంగసభలో విడుదల చేయించేందుకు ప్లాన్ జరుగుతోంది. గతంలో కొల్లాపూర్లో ప్రియాంకగాంధితో బహిరంగసభ నిర్వహించాలని అనుకున్నపుడు వాతావరణం అనుకూలించలేదు. బహిరంగసభకు అన్నీ ఏర్పాట్లు జరిగిన తర్వాత భారీ వర్షాల కారణంగా ప్రియాంక పర్యటన వాయిదాపడింది. అప్పుడు వాయిదాపడిన బహిరంగసభను ఇపుడు నిర్వహించేందుకు రేవంత్ అండ్ కో ప్రయత్నాలు చేసక్తున్నారు. రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో రెండో విడత బస్సుయాత్ర సందర్భంగా పై డిక్లరేషన్లు ఉండే అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

ఒకటి రెండు రోజుల్లోనే రెండో విడత బస్సు యాత్ర రూటు మ్యాప్, డిక్లరేషన్ల ప్రకటనకు అనువైన నియోజకవర్గం ఏది అన్న విషయాలను కూడా నేతలు ఫైనల్ చేయబోతున్నారు. సిద్దరామయ్య, ప్రియాంకల షెడ్యూల్ కు సమయం అతి తక్కువగా ఉండటంతో డిక్లరేషన్లలో ఉంచాల్సిన అంశాలను ఫైనల్ చేయటం నేతలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. టికెట్ల బిజీలో ఉన్న సీనియర్ నేతలు బీసీ, మహిళా డిక్లరేషన్లలో ఉంచాల్సిన అంశాలపై దృష్టి పెట్టలేకపోయారు. కాబట్టి పై డిక్లరేషన్లలో ఏఏ అంశాలుంటాయనేది ఆసక్తిగా మారింది.