మూడు జిల్లాల్లో సర్వే అయిపోయిందా ?
తొందరలోనే జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తును స్పీడ్ పెంచేసింది
By: Tupaki Desk | 16 Aug 2023 8:02 AM GMTతొందరలోనే జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తును స్పీడ్ పెంచేసింది. ఏఐసీసీ తరఫున ప్రతి నియోజకవర్గానికి పరిశీలకులను నియమించింది. వీరంతా రంగంలోకి దిగేశారు. పార్టీ ద్వితీయశ్రేణి నేతలతోను, క్యాడర్ తోనే కాకుండా వివిధ రంగాల్లోని వాళ్ళతో మంతనాలు మొదలు పెట్టేశారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అదనంగా టెలికాలర్స్ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. వచ్చేనెలలో మొదటి జాబితాను ప్రకటించాలన్నది పీసీసీ, ఏఐసీసీ నేతల ఉద్దేశ్యం. అందుకనే అవసరమైన కసరత్తులో జోరు పెంచింది.
ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సర్వే రిపోర్టులు రెడీ అయిపోయినట్లు సమాచారం. ఈ జిల్లాకు కేటాయించిన అబ్జర్వర్లు తమకిచ్చిన బాధ్యతలను పూర్తిచేశారట. మిగిలిన పరిశీలకులు కూడా తమకిచ్చిన నియోజకవర్గాల్లో సర్వేలను పూర్తి చేయబోతున్నారు. ఈ నెలాఖరుకల్లా అన్ని సర్వేలు పూర్తియపోతాయని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. ఒక్కో జిల్లాకు 17 మంది పరిశీలకులను అధిష్టానం నియమించింది.
ఒక్కో నియోజకవర్గంలో ను పోటీ చేయడానికి ముగ్గురు, నలుగురు నేతలు పోటీలు పడుతున్నారు. సిట్టింగులు, సీనియర్లున్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పెద్దగా పోటీలేదు. అంటే ఇలాంటి నియోజకవర్గాలు సుమారు ఒక 45 వరకు ఉంటాయట. మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో సీనియర్ల మధ్య పెద్ద పోటీయే నడుస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి. అందుకనే పోటీపడుతున్న వాళ్ళల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్ధాయిలో తిరిగి తెలుసుకునేందుకే పరిశీలనకులను నియమించింది. పరిశీలకులు తమ సర్వేను పూర్తి చేయగానే ఒక జాబితాను తయారు చేసి, తమ అభిప్రాయాలతో ప్రాయరిటి జాబితాను ఏఐసీసీకి అందించబోతున్నారు.
వీళ్ళ సిఫార్సులు, పీసీసీ నుండి వచ్చిన జాబితా, రాజకీయ వ్యూహకర్తల రిపోర్టును దగ్గర పెట్టుకుని టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఏఐసీసీనే నిర్ణయం తీసుకోబోతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బలమైన వ్యతిరేక గ్రూపు రెగ్యులర్ గా పనిచేస్తోంది. అందుకనే గ్రూపుల ప్రభావం వల్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతినకూడదన్నది అధిష్టానం ఆలోచన. అందుకనే ప్రత్యేకించి పరిశీలకులు అని నియోజకవర్గాలకు నేతలను పంపింది. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చివరకు ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.