Begin typing your search above and press return to search.

ఆ ఎంఐఎం ఎమ్మెల్యేకు కాంగ్రెస్ గాలం!

1994 నుంచి 2014 వరకు యాకుత్ పురా బరిలో దిగి 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన ట్రాక్ రికార్డు అహ్మద్ ఖాన్ సొంతం

By:  Tupaki Desk   |   7 Nov 2023 11:30 PM GMT
ఆ ఎంఐఎం ఎమ్మెల్యేకు కాంగ్రెస్ గాలం!
X

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే టికెట్లు ఖరారైన అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహరచన చేస్తుండగా..టికెట్ ఖరారు కాని కొందరు వేచిచూస్తున్నారు. ఇక, తమ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో పక్క పార్టీల ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న నేతలు మరికొందరు. ఈ కోవలోకే ఎంఐఎం కీలక నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ వచ్చారని తెలుస్తోంది.

చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఎంఐఎం టికెట్ నిరాకరించింది. దీంతో, ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

1994 నుంచి 2014 వరకు యాకుత్ పురా బరిలో దిగి 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన ట్రాక్ రికార్డు అహ్మద్ ఖాన్ సొంతం. ఇక, 2018 ఎన్నికల్లో చార్మినార్ బరిలో దిగి గెలుపొందారు. అయితే, ఈ సారి ఆయన సేవలను ఉపయోగించుకుంటామని, టికెట్ ఇవ్వబోమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్పడంతో అహ్మద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో, ఆయన పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారట. చార్మినార్ ఎన్నికల బరిలో అహ్మద్ ఖాన్ ను కాంగ్రెస్ తరఫున నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రకారం ఆయనకు ఆఫర్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ మూడో జాబితాలో కూడా చార్మినార్ సీటు ఎవరికీ కేటాయించకపోవడం కూడా ఈ పుకార్లకు ఊతమిస్తోంది. కాంగ్రెస్ ఆఫర్ స్వీకరించి ఆయన చార్మినార్ బరిలో దిగుతారా లేక ఎంఐఎంలోనే కొనసాగుతారా అన్నది తేలాల్సి ఉంది.