మాట తూలితే పట్టేస్తున్నారు: కాంగ్రెస్ నిఘా
తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఎట్టిపరిస్థితిలోనూ అధి కారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 27 Nov 2023 9:52 AM GMTతెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఎట్టిపరిస్థితిలోనూ అధి కారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో పార్టీ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసుకుని.. బాధ్యతను కూడా పంచేసిం ది. దీంతో ఆయా కమిటీలు యాక్టివ్‌గా పనిచేస్తూ.. పార్టీకి ఎన్నికల వేళ ఎంతో సహకరిస్తున్నాయి.
ఇలాంటి కమిటీల్లో ఒకటి.. ఫిర్యాదుల కమిటీ. ఇది.. ప్రత్యర్థి పార్టీల నాయకుల ప్రసంగాలు.. ప్రచార తీరు తెన్నులను నిశితంగా గమనిస్తోంది. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినట్టు గమనించినా.. వెంటనే కేంద్ర ఎన్ని కల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల కమిటీకి.. కేంద్ర స్థాయి కాంగ్రెస్ నాయకుడు, ఉన్నత విద్యావంతుడు(ఐఐటీయెన్) రణదీప్ సుర్జేవాలా హెడ్‌గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ఫిర్యాదుల కమిటీ నడుస్తోంది.
రణదీప్ సుర్జేవాలాకు చేతిలో మరో 50 మంది వరకు ఉన్నారు. వీరంతా నిరంతరం.. ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తున్నారు. ఒక్క ప్రత్యర్థుల విషయమే కాదు.. సొంత పార్టీ కాంగ్రెస్ నేతల ప్రచారాలను కూడా గమనిస్తున్నారు. వారికి కూడా సూచనలు చేస్తున్నారు. అదేసమయంలో ప్రత్యర్థి పార్టీ ప్రచారాలను గమనించి.. ఏ చిన్న తేడా వచ్చినా.. వెంటనే వాట్సాప్ ద్వారా అలెర్ట్ చేసి.. క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలను ఆధారాలతో సహా సేకరిస్తున్నారు.
ఆ వెంటనే మెయిల్, ఇన్ స్టా సహా.. వివిధ సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో వీటిని పరిశీలిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఆవెంటనే చర్యలకు ఉపక్రమిస్తోంది. మొత్తంగా.. కాంగ్రెస్‌లో ఎన్నో కమిటీలు ఉన్నా.. ఈ ఫిర్యాదుల కమిటీ మాత్రం దూకుడుగా ఉండడం గమనార్హం.