Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ గెలిస్తే..రేవంతే సీఎం.. పోలింగ్ కు ముందే ప్రచారం షురూ

చివరకు గులాబీ పార్టీ అభ్యర్థులు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో కాంగ్రెస్ కు వీస్తున్న గాలి గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం చూసినప్పుడు.. కాంగ్రెస్ బలం పెరిగిందన్న భావన వ్యక్తమవుతోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 5:18 AM GMT
కాంగ్రెస్ గెలిస్తే..రేవంతే సీఎం.. పోలింగ్ కు ముందే ప్రచారం షురూ
X

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత గుర్తుకు రావొచ్చు. కానీ.. అనుకోవటానికి.. జరుగుతున్న వాస్తవాలకు కొన్నిసార్లు పొంతన ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఎవరు అవునన్నా.. కాదన్నా రాజకీయ వర్గాల్లోనూ.. మీడియా సర్కిళ్లలోనూ తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి స్పష్టంగా వీస్తుందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. చివరకు గులాబీ పార్టీ అభ్యర్థులు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో కాంగ్రెస్ కు వీస్తున్న గాలి గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం చూసినప్పుడు.. కాంగ్రెస్ బలం పెరిగిందన్న భావన వ్యక్తమవుతోంది.

ఇలాంటివేళ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి? అన్న వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. అయితే.. ఈ వాదన తెర మీదకు తీసుకొచ్చి.. చర్చ జరపటం వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఒక అంచనా వచ్చిన వేళ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా.. అన్ని అనుకున్నట్లు జరిగితే.. వాతావరణాన్ని తమకు అనుకూలంగా వీలుగా రేవంత్ అండ్ కో పావులు కదుపుతుందన్న మాట వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్నంతనే.. పలు పేర్లు వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అలా పేర్లు వినిపించకుండా ఉండేందుకు సీరియస్ వాదనను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాల్ని షురూ చేశారు. అందులో ముఖ్యమైన పాయింట్ ఏమంటే.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు కేటీఆర్.. హరీశ్ లతో పాటు.. బీజేపీ అండ్ కో సైతం టీ కాంగ్రెస్ కు సంబంధించి ఏ నేతను టార్గెట్ చేశారన్న ప్రశ్నను సంధిస్తున్నారు. దీనికి సమాధానంగా వస్తున్నది ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డే కనిపిస్తారు.

పార్టీ అధినాయకత్వం కానీ పార్టీకి చెందిన నేతలు సైతం రేవంత్ మాదిరి తెలంగాణలో పార్టీని నిలబెట్టే విషయంలో అంతా తానై వ్యవహరించిన రేవంత్ ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన్ను కూర్చోబెట్టాలన్న వాదనను బలంగా వినిపిస్తున్నారు. అంతేకాదు.. అధికార పక్షంతో కోట్లాడాలన్నా.. కేసీఆర్ లాంటి బలమైన అధినేతను ఢీ కొట్టాలన్నా రేవంత్ మినహా మరొకరు టీ కాంగ్రెస్ లో కనిపిస్తారా చెప్పండి? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. అంతేకాదు.. అవసరమైతే తిమ్మిని బమ్మిని చేసే సత్తా కూడా రేవంత్ కే నని చెప్పటంతో పాటు.. పార్టీకి ఎదురయ్యే సవాళ్ల లెక్క చూడటంలోనూ రేవంత్ కు ఉన్న టాలెంట్ మరెవరికీ లేదంటున్నారు. ఇలా.. రేవంత్ గొప్పతనాన్ని.. అతడి సమర్థతను కొనియాడుతున్న వారంతా ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే ఒక ఫ్లాట్ ఫాం సిద్దం చేసే యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.