గ్రేట్ వాల్... మహాత్మగాంధీ జన్మస్థలానికి, సమాధికి మధ్య గోడ నిర్మాణం!
ఈ క్రమంలో... భారత్ కూడా ఆ తరహాలో ఓ గ్రేట్ వాల్ ను నిర్మించబోతోంది! ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!
By: Tupaki Desk | 18 March 2025 1:11 PM ISTగ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఈ గోడ.. అతిపొడవైన కృత్రిమ నిర్మాణం. దీని పొడవు సుమారు 21,196 కి.మీ. కాగా.. ఈ గోడ నిర్మాణం 1800 సవంత్సరాలకు పైగా కొనసాగినట్లు చెబుతారు. ఈ క్రమంలో... భారత్ కూడా ఆ తరహాలో ఓ గ్రేట్ వాల్ ను నిర్మించబోతోంది! ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!
అవును... భారతదేశం ఓ భారీ గోడను నిర్మించబోతోంది. ఈ గోడ పొడవు సుమారు 1,400 కి.మీ ఉంటుందని చెబుతున్నారు. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకూ విస్తరించి ఉంటుందని అంటున్నారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతాలను, ఆరావళి పర్వత శ్రేణిని మళ్లీ పచ్చగా మార్చడమే దీని ఉద్దేశ్యంగా చెబుతున్నారు.
ఈ భారీ గోడను గుజరాత్ లోని పోర్ బందర్ నుంచి ఢిల్లీలోని మహాత్మగాంధీ సమాధి రాజ్ ఘాట్ వరకూ 1,400 కి.మీ పొడవున నిర్మించనున్నారు. అంటే... ఇది మహాత్మగాంధీ జన్మస్థలాన్ని, ఆయన సమాధి స్థలాన్ని ప్రతీకాత్మకంగా అనుసంధానిస్తుందన్నమాట. ఇదే క్రమంలో... రాజస్థాన్, హర్యానాలోని 27 జిల్లాల్లోనూ ఇది విస్తరిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల 1.15 మిలియన్ హెక్టార్లకు పైగా అడవుల పునరుద్ధరణ, చెట్లను నాటడం, వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి వనరుల పునరుద్ధరణ జరుగుతుందని.. 5 కి.మీ వెడల్పు గల గ్రీన్ వాల్ కార్బన్ సింక్ లాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యూనియన్ "గ్రేట్ గ్రీన్ వాల్" నుంచి ప్రేరణ పొందిందని అంటున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ వ్యయం విషయానికొస్తే... మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.7,500 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. అయితే... ఇందులో 78శాతం కేంద్రం సమకూర్చనుండగా.. 20శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉండగా.. 2శాతం నిధులు అంతర్జాతీయ సంస్థలు సమకూరుస్తాయి. ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత 2030 నాటికి సుమారు 25 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరించారలే లక్ష్యం నెరవేరుతుందని చెబుతున్నారు. దీనివల్ల దుమ్ము, కాలుష్యం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారు.