'కరప్ట్ వర్కింగ్ కమిటీకి స్వాగతం'- హైదరాబాద్‌లో వివాదాస్పద పోస్టర్లు
అయితే.. దీనికి కౌంటర్‌గా "కరప్ట్ వర్కింగ్ కమిటీకి స్వాగతం"- అంటూ.. తీవ్ర వివాదాస్పదంగా ఉన్న పోస్టర్లు వెలిశాయి.
By: Tupaki Desk | 16 Sep 2023 5:56 AM GMTఒకవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీంతో కాంగ్రెస్ నేతలు.. 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు వస్తున్న నాయకులకు స్వాగతం' అంటూ భారీ ఎత్తున పోస్టర్లు వేయించారు. అయితే.. దీనికి కౌంటర్‌గా "కరప్ట్ వర్కింగ్ కమిటీకి స్వాగతం"- అంటూ.. తీవ్ర వివాదాస్పదంగా ఉన్న పోస్టర్లు వెలిశాయి. దీంతో ఈ పరిణామం రాజకీయంగా కలకలం రేపుతోంది.
అసలు ఏం జరిగింది?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరగనుంది. దీంతో ఆ పార్టీ అగ్రనాయకు లు మల్లికార్జున ఖర్గే నుంచి సోనియా వరకు కూడా చాలా మంది నాయకులు హాజరు కానున్నారు. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న కీలక సమావేశం కావడంతో చాలా వరకు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు.
అయితే.. రాజకీయంగా కీలకమైన ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎవరు అంటించారో తెలియదు కానీ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని "కరప్ట్ వర్కింగ్ కమిటీ" అని పేర్కొంటూ హైదరాబాద్ వ్యాప్తంగా పోస్టర్లను అంటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్ లు ఉండడంతో ఇవి రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
'బివేర్ ఆఫ్ స్కామర్స్' అనే టాగ్ లైన్ ను కూడా జోడించడంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుందో అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో యూపీఏ హయాంలో జరిగిన స్కాంల గురించి కూడా పోస్టర్లలో వివరించడం గమనార్హం. మల్లికార్జున ఖర్గే – నేషనల్ హెరాల్డ్ స్కాం, సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం, ఛాపర్ స్కాం, మన్మోహన్ సింగ్ – కోల్ అలోకేషన్ స్కాం, రాహుల్ గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం ఏకే ఆంటోనీ – నేషనల్ హెరాల్డ్ స్కాం.. అంటూ.. కీలక నేతల పేర్లతో ఇలా పోస్టర్లు వేయడం సంచలనంగా మారింది. రాత్రికి రాత్రి వెలసిన ఈ పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సమాయత్తమవుతున్నారు.