Begin typing your search above and press return to search.

మిత్రదేశంలోనూ జాతిపితకు అవమానమా?

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ.. ఇంటర్నెట్ లోనూ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Feb 2025 5:04 AM GMT
మిత్రదేశంలోనూ జాతిపితకు అవమానమా?
X

సంచలనాల కోసం కొన్ని దేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు.. కంపెనీలు వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటాయి. అయితే.. భారత్ కు అత్యంత సన్నిహిత దేశంగా.. మంచి మిత్రుడిగా వ్యవహరించే రష్యాలోని ఒక బ్రువరీ కంపెనీ తీరు మంట పుట్టేలా ఉందని చెప్పాలి. తమ బీరు ఉత్పత్తులకు దేశ జాతిపిత మహాత్మాగాంధీ ఫోటోల్ని వాడుకోవటం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ.. ఇంటర్నెట్ లోనూ వైరల్ అవుతున్నాయి. గాంధీని అవమానించిన తీరుపై పెద్ద ఎత్తున మండిపాలు వ్యక్తమవుతోంది.

రష్యాకు చెందిన రివోర్ట్ సంస్థ మహాత్మా గాంధీ చిత్రంతో పాటు.. మహాత్మ జి అన్న పేరును ముద్రించి బీర్ క్యాన్ల అమ్మకాల్ని చేపడుతున్నారు. ఈ వ్యవహారం తాజాగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనమడి కంట్లో పడటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ తీరుపై ఆయన సీరియస్ అయ్యారు.

ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలని.. సదరు కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రష్యా కంపెనీ చేసిన నిర్వాకాన్ని ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. సదరు కంపెనీ తీరుపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

మహాత్ముడికి అల్కాహాల్ కు సంబంధం ఏమిటన్న ప్రశ్నలు వేస్తున్నారు. తక్షణమే ఈ చిత్రాల్ని తొలగించాలని.. కోట్లాది మంది భారతీయుల మనోభావాల్ని దెబ్బ తీసేలా వ్యవహరించిన కంపెనీ తీరును తప్పు పడుతున్నారు. గతంలోనూ ఒక ఇజ్రాయెలీ లిక్కర్ కంపెనీ సైతం గాంధీజీ ఫోటోల్ని వాడింది. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో చెంపలేసుకున్న సదరు కంపెనీ.. చిత్రాల్ని తొలగించింది. తాజా ఉదంతంలో మాత్రం సదరు కంపెనీ మీద చర్యలకు భారత్ పట్టుబట్టాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.