Begin typing your search above and press return to search.

'చాగంటి నియామకం సబబు కాదు'... బాబుకు ప్రముఖుల బహిరంగ లేఖ!

అయితే.. ఈ నియామకంపై సరికొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చాగంటి నియామకం సబబు కాదంటూ 30 మంది ప్రముఖులు చంద్రబాబుకు లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 8:44 AM GMT
చాగంటి నియామకం సబబు కాదు... బాబుకు ప్రముఖుల బహిరంగ లేఖ!
X

ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ లో చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ నియామకం చేసింది ప్రభుత్వం. అయితే.. ఈ నియామకంపై సరికొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చాగంటి నియామకం సబబు కాదంటూ 30 మంది ప్రముఖులు చంద్రబాబుకు లేఖ రాశారు.

అవును... విద్యార్థుల్లో నైతిక విలువల సలహాదారుగా, ఫ్యూడల్ విలువలను ప్రసారం చేసే ప్రముఖ పౌరాణిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావును నియమించడంపై పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు గేయానంద్ అధ్యక్షతన ఆన్ లైన్ లో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా కీలక చర్చ జరిగింది.

ఈ సమావేశంలో ప్రముఖ సినీ దర్శకులు సి ఉమామహేశ్వర రావు, న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, ప్రముఖ సాహితీ విమర్శకులు చంద్రశేఖర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఐ వెంకటేశ్వర రావు మొదలైన పాల్గొన్నారు. ఈ సమావేశం నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆసక్తికర విషయాలను ప్రస్థావించారు.

ఇందులో భాగంగా... టీడీపీ కూటమి ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి, విద్యార్థుల వికాసానికి పెద్ద పీటి వేసి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు కంకణం కట్టుకుందని ఆశిస్తున్న తమలాంటి వారందరికీ.. విద్యార్థుల నైతిక విలువల కోసం పురాణ ప్రవక్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించడం నిరాశ కలిగించిందని అన్నారు.

మానవుడు ప్రకృతి రహస్యాలను ఒక్కోదాన్ని గుప్పెట్లోకి తెచ్చుకొని, అంతరిక్షపు అంచులకు చేరుకుంటున్న కాలంలో మనం ఉన్నామని.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏయే దేశలూ ముందున్నాయో అవే ప్రపంచాన్ని శాసిస్తున్నాయని.. ప్రజల్లో కూడా వైజ్ఞానిక దృక్పథం కూడా విస్తరించినప్పుడే ఈ శాస్త్ర సాంకేతిక విప్లవం సాధ్యమవుతుందని తెలిపారు.

ప్రపంచమంతా పరుగులు తీస్తున్న ధోరణికి భిన్నంగా మన భవిష్యతరాన్ని పురాణ యుగంలోకి మళ్లించడం మనల్ని ఎక్కడికి తీసుకు వెళ్తుందో తమ ప్రభుత్వం గుర్తించగలదని భావిస్తున్నామని.. మనది వైవిధ్య భరిత సాంస్కృతిక మూలాలున్న దేశమని.. ఈ భిన్నత్వమే మన శక్తి అని చంద్రబాబుకు రాసిన లేఖలో రాసుకొచ్చారు.

దీనికి తగినట్లుగా మన విద్యార్థుల్ని తీర్చగలిగేందుకు పౌరాణిక నీతులు ఎంతవరకూ మనికొస్తాయో ఆలోచించాలని లేఖలో సూచించారని అంటున్నారు. ఇదే క్రమ్మలో.. మన విద్యావిధానం ఏమాత్రం శాస్త్రీయంగా లేదని.. మన పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వివరించారు. ముందుగా మన విద్యారంగంలో మార్పులు తీసుకురావాల్సి ఉందని తెలిపారు.

వీటిని ఉన్నవి ఉన్నట్లే ఉంచి పురాణకాలపు నైతిక విలువలను బోధించడంతో ఏమి ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. విద్యార్థుల్ని సమకాలీన ప్రపంచానికి సమర్థులైన ప్రతినిధులుగా తీర్చిదిద్ధడంలో పౌరాణిక పండితులు చేయగలిగిందేమీ లేదని అభిప్రాయపడ్డారు.