రేవంత్ ఫ్యామిలీతో ముడిపెట్టి... తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకరమైన పోస్టులు..!
ఈ నేపథ్యలో.. సోషల్ మీడియా వేదికగా పలువురు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.. అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారు!
By: Tupaki Desk | 7 Dec 2024 2:43 PM GMTఇటీవల సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్యకరమైన, అభ్యంతరకర పోస్టులపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సర్కార్ తీవ్రంగా స్పందిస్తోంది.. ఇలాంటి వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహంపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో.. వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.
అవును... ఈ నెల 9న తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం... దీన్ని అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ క్రమంలో... సచివాలయంలో సీఎం రేవంత్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యలో.. సోషల్ మీడియా వేదికగా పలువురు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.. అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారు! ఏమాత్రం హర్షించడానికి వీలులేని రీతిలో ఉన్నట్లు చెబుతున్న ఈ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సోషల్ మీడియా ఛైర్మన్ మన్నె సతీష్ కుమార్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇలా తెలంగాణ తల్లి విగ్రహంపై పెట్టిన అసభ్యకరమైన పోస్టుల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ముడిపెట్టి పోస్టులు పెట్టారు! ఇందులో భాగంగా... తెలంగాణ తల్లి విగ్రహం సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి లాగా.. ఆయన కుమార్తె లాగా ఉన్నట్లు పలువురు పోస్టులు పెట్టారు! ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా తీసుకొంది.
కాగా... తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకర, అభ్యంతరకర కామెంట్లు గతంలోనూ వినిపించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను పోలి ఉందని విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో.. తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో దొరల అహంకారానికి గుర్తుగా ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆకుపచ్చ రంగు చీరలో సిద్ధం చేశారు! చేతిలో మొక్కజొన్న కంకులు, వరి కంకులు, మెడలో ఆభరణాలు, కాళ్లకు పట్టీలు పెట్టినట్లు ఉంది! ఈ నేపథ్యంలో... తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ గతంలో చర్చకు వచ్చిన లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు!