Begin typing your search above and press return to search.

మోడీ అలా నిర్ణయం తీసుకున్నారో లేదో వంట నూనెల ధరల్ని పెంచేశారు

వంటింటిపై మరోసారి షాకింగ్ అస్త్రాన్ని ప్రయోగించింది మోడీ సర్కారు. మొన్నటి వరకు మండిన వంటనూనెల ధరలు..

By:  Tupaki Desk   |   15 Sep 2024 6:19 AM GMT
మోడీ అలా నిర్ణయం తీసుకున్నారో లేదో వంట నూనెల ధరల్ని పెంచేశారు
X

వంటింటిపై మరోసారి షాకింగ్ అస్త్రాన్ని ప్రయోగించింది మోడీ సర్కారు. మొన్నటి వరకు మండిన వంటనూనెల ధరలు.. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న మార్పుల పుణ్యమాఅని ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం వరకు లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ 150వరకు ఉండగా.. ఇటీవల కాలంలో రూ.120 వరకు తగ్గింది. కొన్ని బడా సూపర్ మార్కెట్లలో మాత్రం లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.115 చొప్పున అమ్ముతున్న పరిస్థితి. ఈ ధరలతో సామాన్యుల మీద ఆయిల్ భారం తగ్గే పరిస్థితి.

ఇలాంటివేళ.. కేంద్రప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల మీద 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఒక్కసారిగా ధరల భారం దాదాపు 20 శాతం పెరగనుంది. అంతేకాదు. శుద్ధిచేసిన పామాయిల్.. సోయా.. సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకం ఇప్పటివరకు 12.5 ఉండగా.. దాన్ని ఏకంగా 32.5 శాతానికి పెంచేశారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

దిగుమతి సుంకం మాత్రమే కాదు అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్.. డెవలప్ మెంట్ సెస్ లతో పాటు సోషల్ వెల్ఫేర్ సర్ ఛార్జ్ లు అదనంగా వడ్డించనున్నారు. దీంతో దగ్గర్లో దగ్గర 20-30 శాతం వరకు వంట నూనెల ధరలు పెరగనున్నాయి. అంటే.. లీటరు పాకెట్ మీద రూ.20 - 30కు పైనే ధరలు పెరగే అవకాశం ఉందని చెప్పాలి. విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి.. శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్ లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్నాయి. దీంతో.. రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి మేలు చేకూరేలా తాజా నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రపంచంలో వంట నూనెల్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉండనుంది. పామాయిల్ వాటా 50 శాతం వరకు ఉంది. ఇక.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల విషయానికి వస్తే.. ఇండోనేషియా.. మలేషియా.. థాయ్లాండ్ నుంచి పామాయిల్.. అర్జెంటీనా.. బ్రెజిల్.. రష్యా.. ఉక్రెయిన్ నుంచి సోయా, సన్ ఫ్లవర్ ఆయిల్ భారత్ కు దిగుమతి అవుతున్నాయి.

మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో రానున్న రోజుల్లో దిగుమతి అయ్యే వంట నూనెలు ప్రాసెస్ అయి.. ప్యాకింగ్ పూర్తై మార్కెట్ లోకి వచ్చిన తర్వాత నుంచి ధరల పెంపు ఉండాల్సి ఉంది. దీని కోసం కనీసం రెండు వారాల సమయం పడుతుంది. కానీ.. ఎప్పుడైతే కేంద్రం సుంకం నిర్ణయాన్ని వెల్లడించిందో.. ఆ వెంటనే వంట నూనెల ధరల్ని పెంచేస్తూ వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. వంట నూనెల పాకెట్ల మీద ఎంఆర్ పీ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో.. ఎమ్మార్పీకి సంబంధించి ఎలాంటి చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదు. దీన్నిఅసరాగా చేసుకొని లీటరుకు రూ.20 చొప్పున ధరల్ని పెంచేసి అమ్మేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి కనిష్ఠంగా 4.. గరిష్టంగా ఆరు పాకెట్ల వంట నూనెల్ని వినియోగిస్తుంటారు. అందరిమీదా భారం పడేలా మోడీసర్కారు తాజా నిర్ణయం ఉందని చెప్పాలి.